మాస్టర్ మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించిన ఈ చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కట్టుబాట్లకు పెట్టింది పేరు సరస్వతిపురం గ్రామం. అక్కడ తప్పుడు చేసిన వారికి గ్రామ పెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తాడు. ఆ ఊరి ట్రైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ(మాస్టర్ మహేంద్రన్) పదో తరగతి చదువుతున్న సమయంలో ఓ తప్పు చేస్తాడు. దానికి శిక్షగా 15 ఏళ్ల పాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఆ శిక్ష కారణంగా నీలకంఠ ఉన్నత చదువులు చదవలేకపోతాడు. దీంతో ఊర్లోనే కబడ్డీ ఆట ఆడడం మొదలుపెడతాడు. ఊర్లో జరిగే అన్ని కబడ్డీ పోటీల్లోనూ గెలుస్తాడు. కానీ ఆయనకి పడ్డ శిక్ష కారణంగా మండల స్థాయి కబడ్డీ ఆటల్లో పాల్గొనలేకపోతాడు. దీంతో ప్రతిసారి సరస్వతిపురం మండలస్థాయిలో ఓడీపోతూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే..టెన్త్ క్లాస్‌లో నీలకంఠ ఆ ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి) ఇష్టపడతాడు. ఆమె ఉన్నత చదువుల కోసం వెళ్లి.. 15 ఏళ్ల తర్వాత తిరిగి ఊరికి వస్తుంది. తన కూతురు నీలకంఠతో ప్రేమలో ఉందన్న విషయం తెలుసుకున్న సర్పంచ్.. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటాడు.
నీలకంఠ అడ్డుకొని.. సీత వాళ్ళ నాన్న ఏది అయితే స్థాయి అనుకుంటున్నాడో ఆ సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. దొంగగా ముద్ర వేసుకున్న నీలకంఠ సర్పంచ్గా గెలిచాడా? మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిసారి ఓడిపోతున్న సరస్వతీ గ్రామాన్ని నీలకంఠ ఎలా గెలిపించగలిగాడు? అసలు నీలకంఠ చేసిన తప్పేంటి? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం నీలకంఠ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా(Nilakanta Review) చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఒక ఊరు..అక్కడ కొన్ని కట్టుబాట్లు.. అవి పాటించకపోతే ఓ పెద్దమనిషి శిక్ష వేయడం.. చేయని తప్పుకు హీరో శిక్ష అనుభవించడం..చివరకు ఊరి కోసం హీరో ఏదో ఒక మంచి పని చేసి..వారందరిచేత జై కొట్టించుకోవడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో ‘పెదరాయుడు’ తో పాటు చాలా సినిమాలు వచ్చాయి. నీలకంఠ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ కోర్ పాయింట్ కాస్త కొత్తగా ఉంటుంది. తప్పు చేస్తే ఊరు నుంచి వెలేయడం గత సినిమాల్లో చూశాం..కానీ ఇందులో మాత్రం తప్పు చేసినవాడిని ఊర్లోనే ఉంచి..ఇఫ్టమైనది దూరం చేయడం అనేది ఆసక్తికర అంశం. సినిమా ప్రారంభంలోనే ఆ విషయం చెప్పి.. అసలు కథను ప్రారంభించారు దర్శకుడు. నాన్ లినియర్ స్క్రీన్ ప్లేతో కథను ముందు వెనక్కి జరుపుతూ.. తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశారు.
ఫస్టాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీతో పాటు హీరోయిన్‌తో లవ్‌స్టోరీని చూపించి.. ఓ సస్పెన్స్‌తో ఇంటర్వెల్ సీన్ కట్ చేశారు. ఇక సెకండాఫ్ అంతా సీరియస్‌గా సాగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి.ఊరు లో జరిగే కబడ్డీ స్పోర్ట్స్ ని బాగా చిత్రీకరిచారు. చివరి 25 నిముషాలు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. కధకి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ని లాస్ట్ లో కొత్తగా చూపించారు. తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడం లో దర్శకుడు విజయం సాధించాడు.అయితే ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న మాస్టర్ మహేంద్రన్.. ఈ మూవీతో హీరోగా మారి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సీత పాత్రకి యష్న ముతులూరి న్యాయం చేసింది.స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్ తో చేసింది.రాంకీ గారిని చాల రోజుల తరువాత స్క్రీన్ మీద చూడటం బాగా అనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ ప్రశాంత్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వింటేజ్ ఫిలింగ్‌ని కలిగిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- రేటింగ్: 2.5/5


