
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై రెండు వారాలైందంతే.. అప్పుడే ఫ్యామిలీ కోసం బోరుమని ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. ప్రతిసారి కనీసం నెల రోజుల తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లెటర్లు గట్రా పంపేవాడు. అదేంటో కానీ ఈసారి రెండువారాలకే ఈ కుటుంబ ఎమోషన్స్ ఎపిసోడ్ మొదలుపెట్టేశారు. బ్లూ సీడ్స్ అందుకున్నవారికే ఈ అవకాశం కల్పించాడు.
సీక్రెట్ బాక్స్ ఓపెన్
అందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫోటో గెల్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ, ప్రియ ఇంటినుంచి లెటర్స్ అందుకున్నారు. సుమన్ ఇంటినుంచి ఏదైనా అందుకోవాలంటే భరణి సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టాడు. దీంతో అతడు తన బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చైన్, లాకెట్ ఉంది. లాకెట్‌లో అమ్మ, గురువు అని రాసుంది. వీరిద్దరూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.
శ్రీజ, రీతూ మధ్యే అసలైన పోటీ
అలా సుమన్ తండ్రి ఫోటో అందుకున్నాడు. కానీ సంజనాకు ఏదీ అందలేదు. ఇకపోతే బ్లాక్ సీడ్స్ ఉన్న ముగ్గురు రీతూ, శ్రీజ, ఫ్లోరాకు గురి తప్పద్దు అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌కు సంజనాను సంచాలక్‌గా పెట్టారు. ఇక బరిలో దిగిన శ్రీజ, రీతూ పోటాపోటీగా ఆడారు. రీతూ విజయం తథ్యం అన్న సమయంలో శ్రీజ ఆటను మలుపు తిప్పింది. తను గెలవకపోయినా పర్లేదు కానీ రీతూ గెలవకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరాకు సాయం చేసింది.

నీలాగా బూతులు మాట్లాడట్లేదుగా
అది చూసిన రీతూ.. గేమ్ సరిగా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ, ఇదేంటి? అని చిరాకు పడింది. అందుకు శ్రీజ.. నా గేమ్ నా ఇష్టం. నువ్వు మొన్న రాముకు సపోర్ట్ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా.. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హర్ట్ చేయట్లేదుగా అని కౌంటరిచ్చింది. చివరకు ఈ గేమ్‌లో ఫ్లోరా గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకుంది.
ఎప్పుడూ ఇంతే..
అంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు అదృష్టం కలిసిరాదు, ఎప్పుడూ ఇంతే.. అని బోరుమని ఏడవడంతో అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ఈ వారం ఫ్లోరా గెలవడంతో నామినేషన్స్‌లో ఐదుగురే మిగిలారు. వారే ప్రియ, రాము, రీతూ, పవన్ కల్యాణ్, హరీశ్. వీరిలో ప్రియ డేంజర్ జోన్‌లో ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి!