ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా ఇదే గ్రౌండ్‌లో 220 ఫీట్ల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్‌లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్‌కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు.


