ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయింది భరణి పరిస్థితి. దివ్య.. తనూజ గొడవపడి అసలు సంబంధమే లేని భరణిని మధ్యలోకి లాగారు. నాతో మాట్లాడొద్దని తనూజ.. మీ పేరొచ్చినప్పుడు మాట్లాడలేరా? స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి అని దివ్య.. భరణిపై ప్రతాపం చూపించారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్7వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
తడబడిన సాయి
కెప్టెన్సీ కంటెండర్స్‌ను సెలక్ట్ చేసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. వారిలో ఎవర్ని సైడ్ చేయాలి? ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యతను హౌస్‌మేట్స్ చేతిలో పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో కంటెండర్‌కు సపోర్ట్‌గా నిలబడ్డారు. రాము.. తనూజకు సపోర్ట్ చేస్తానని ఇచ్చిన మాట కోసం భరణిని తీసేశాడు. సాయి శ్రీనివాస్ దివ్యను తీసేయబోతే.. నిన్ను కాపాడుకుంటూ వచ్చా, నన్నే తీస్తున్నావా? అని ధమ్కీ ఇచ్చింది.

చివరకు ముగ్గురు
దెబ్బకు జడుసుకున్న సాయి (Sreenivasa Sayee).. రీతూ పేరెత్తాడు. నేనేం చేశానని ఆమె ఉగ్రరూపం ఎత్తడంతో సుమన్ పేరు ప్రస్తావించాడు. వాళ్లిద్దరూ నోరేసుకుని పడిపోయారని నామీదకు వచ్చావా? అని సుమన్ ఆగ్రహించాడు. దీంతో సాయి మళ్లీ తను మొదట చెప్పినట్లుగా దివ్యను గేమ్‌లో అవుట్ చేశాడు. నిఖిల్.. సుమన్‌ను తీశాడు. అలా చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్.. ముగ్గురు మిగిలారు. సరిగ్గా ఇప్పుడే దివ్య చక్రం తప్పింది.
టార్గెట్ తనూజ
తనూజ, రీతూ ఉంటే.. రీతూనే తీస్తానన్న ఆమె సడన్‌గా మనసు మార్చుకుని తనూజను సైడ్ చేసింది. అది తట్టుకోలేకపోయిన తనూజ.. మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేశావ్.. భరణిగారి వల్లే తీసేశావ్ అని ఆగ్రహించింది. మధ్యలో నా పేరెందుకొచ్చిందని భరణి షాకై చూశాడు. తనూజను తీసేయవనే ఆ కుర్చీ ఇచ్చానని కల్యాణ్ అంటే.. ఆమె ఉంటే ఇమ్మూకి గెలుపు కష్టమవుతుందనే తనూజను తీసేశానని దివ్య బదులిచ్చింది.

దివ్యపై భరణి ఉగ్రరూపం
మీ పర్సనల్స్ బయట పెట్టుకో, హౌస్‌లో కాదని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి ఆవేశంగా లోపలకు వెళ్లిన తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె మాటలు విన్నారా? ఇప్పుడు హ్యాపీయా? నా గేమ్‌లో మీ పేరెందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అని అందరి ముందే భరణిపై అరిచింది. కాసేపటికి ఒంటరిగా ఉన్న భరణి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా? అని అడిగింది. ఆయన కోపంగా ఉన్నాడని అర్థమై ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అరిచినందుకు సారీ చెప్దామని వచ్చానంది. ఏం మాట్లాడాలి? నామీద అరవడం ఫస్ట్ టైమా? నువ్వేదో అంటావ్.. తనేదో అంటుంది.
ఇలాగైతే నేను ఊరుకోను
మధ్యలో నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అవసరమైతే తనతో తర్వాత మాట్లాడతా కదా.. అని భరణి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె సారీ చెప్పి కెప్టెన్ రూమ్‌లోకి వెళ్లిపోయింది. మా మమ్మీడాడీని చూస్తే కూడా నాకు భయమయలేదు. ఆయన కళ్లలో అంత కోపం చూశాను.. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు.. కానీ, అది బయటకెళ్లాక చూసుకుంటానిక.. ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇమ్మాన్యుయేల్‌తో అంది. తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్‌కు ఓ గేమ్ పెట్టగా అందులో ఇమ్మూ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. దివ్య ఎత్తుగడ వల్ల తనూజకు జనాల్లో సింపతీ రావడం ఖాయం. ఈ ఎపిసోడ్‌తో తనూజ కప్పు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి: హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!


