సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రచారం చేసిన సెలబ్రిటీల కేసులో సీఐడీ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు.
దాదాపు రెండు గంటల పాటు వీరు ముగ్గురిని సీఐడీ అధికారుల బృందాలు వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన సంపాదనపై ఆరా తీసినట్టు సమాచారం. ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రమోషన్‌కు ప్రతిగా అందిన పారితోషికం తదితర అంశాలపై సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.


