అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.
గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్‌లో అయినా బిగ్‌బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.
సింపతీకే ఓటు
తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్‌లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూ కౌశల్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్‌తో కొట్టిన కౌశల్‌కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.
పోరాడినా ఫలితం దక్కలేదు
మూడో సీజన్‌లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్‌బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్‌లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.
ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!
ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్‌కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.
ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..
మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది.
సీజన్ విజయానికి కారకురాలు
ఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్‌మైండ్‌తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్‌బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు.
లేడీ సెలబ్రిటీలు జాగ్రత్త
అమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే!


