విజయనగరకు ఇంచార్జి మంత్రిగా జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ | - | Sakshi
Sakshi News home page

విజయనగరకు ఇంచార్జి మంత్రిగా జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

హొసపేటె: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రంలో కరువు అధ్యయనం కోసం జిల్లా ఇంచార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి బీ.జెడ్‌.జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ విజయనగర జిల్లా ఇంచార్జి మంత్రిగా తిరిగి నియమితులయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వరద, కరువు పరిస్థితులపై తమకు కేటాయించిన జిల్లాల్లో తక్షణమే పర్యటించి, పరిస్థితులను పరిశీలించి, వాస్తవ స్థితిపై ఉపముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి వెంటనే నివేదిక సమర్పించాలని ఇంచార్జి మంత్రులను ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ఆదేశించారు.

యువకుడు దారుణ హత్య

సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్‌: పాతకక్షల నేపథ్యంలో దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బూరు ఫిర్కా పరిధిలోని సుంకేశ్వరహాళ రోడ్డులో జరిగింది. హద్దినాళ గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్త, దళిత యువకుడు భూమానంద(28)ను మంగళవారం రాత్రి హద్దినాళ క్రాస్‌లో పాత కక్షలతో దుండగులు మారణాయుధాలతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై గబ్బూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దళిత యువకుడిని దారుణంగా హత్య చేయడం హేయమని, నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్‌ చేయాలని మాదిగ పోరాట సమితి తదితర దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. హత్యను నిరసిస్తూ సుంకేశ్వరహాళ వద్ద చేపట్టిన రాస్తారోకోలో దళిత సంఘం నేత ప్రభురాజ్‌ కొడ్లి మాట్లాడారు. ఆందోళనలో హన్మంతప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఎస్పీ హరీష్‌, డీఎస్పీ దత్తాత్రేయ కార్నాడ్‌లున్నారు.

మాజీ ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

బళ్లారిఅర్బన్‌: వ్యక్తిగత ఫోటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ మాజీ ప్రియుడి వేధింపులు, బెదిరింపులకు గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని కౌల్‌బజార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. గతంలో కౌల్‌బజార్‌కు చెందిన అజీం అనే యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, కొంతకాలం తర్వాత అతనితో విభేదాల కారణంగా దూరమైంది. అనంతరం అజీం స్నేహితుడు సోహైల్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అజీం తనతో ఉన్న వ్యక్తిగత ఫోటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు ముందు ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి, తన మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసింది.

అడవి పంది వేటగాళ్ల అరెస్టు

హొసపేటె: తమకు అందిన సమాచారం మేరకు హొసపేటె జోనల్‌ అటవీ శాఖ సిబ్బంది దాడి నిర్వహించి, అడవి పందులను అక్రమంగా వేటాడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. తాలూకాలోని మరియమ్మనహళ్లి పరిధిలో చిక్కకెరె సమీపంలో అరెస్టయిన నిందితులు అడవి పందులను అక్రమంగా వేటాడుతున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితులను హనుమనహళ్లికి చెందిన టీ.పరశురామ, కే.పాండురంగ, సోమప్ప, మగిమావినహళ్లికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద కేసు నమోదు చేసి జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచి, జ్యుడీషియల్‌ కస్టడీకి రిమాండ్‌ చేసినట్లు హొసపేటె జోనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కౌశిక్‌ దళవాయి తెలిపారు.

ఆకతాయి కోతి బందీ

హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి, చిలకనహట్టి చుట్టు పక్కల గ్రామస్తులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆకతాయి కోతిని జోనల్‌ అటవీ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. హారువనహళ్లి, చిలకనహట్టి, తిమ్మలాపుర గ్రామాల్లో ఈ కోతి ప్రజలను, విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా అటవీ శాఖ సిబ్బంది కోతిని పట్టుకోడానికి బోనును పెట్టారు. దానికి ఇంజెక్షన్‌ ఇచ్చి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌కు జోనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కౌశిక్‌ దళవాయి, చిలకనహట్టి బ్రాంచ్‌ డిప్యూటీ జోనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నాగరాజ్‌, పెట్రోల్‌ ఫారెస్ట్‌ గార్డ్స్‌ రమణ ఇతరులు నాయకత్వం వహించారు. మల్లికార్జున, అటవీ గార్డులు రఫీ, స్వామి, హేమన్న, నాగేశ్‌, హంపీ జూకు చెందిన మత్తు మందు నిపుణుడు మహేంద్ర పాల్గొని, గ్రామస్తుల సహాయంతో కోతిని పట్టుకోవడంలో సఫలమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement