
వాషింగ్టన్: అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన భారతీయులనే టార్గెట్ చేసి ఇలా అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ సందర్భంగా ప్రతీ హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో, హెవార్డ్ మాట్లాడుతూ..‘ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే. కేవలం అత్యుత్తమైన, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలి. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
“Stop this nonsense of letting people come to America on visas for free. Only valuable people are welcome,” says US Commerce Secretary Howard Lutnick hiking H1B visa fee pic.twitter.com/SwGh3D9sih
— Shashank Mattoo (@MattooShashank) September 19, 2025
దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హెచ్1బీ వీసాలపై భారతీయులే ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తారు. ఈ నేపథ్యంలో హోవార్డ్.. భారతీయులను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేశారని, అవమానించే విధంగా మాట్లాడరని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్య 28లక్షలుగా ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా ద్వారా.. ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ప్రతీ ఏడాది 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది.