‘ఆయకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’ | Trump’s Secret Plane Switch Sparks Iran Mockery | Sakshi
Sakshi News home page

‘ఆయకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’

Aug 14 2026 6:54 AM | Updated on Aug 14 2026 6:54 AM

Trump’s Secret Plane Switch Sparks Iran Mockery

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్‌ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్‌ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.

నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్‌ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.

ఇరాన్‌ మీడియా వ్యంగ్యం
ఈ ఘటనను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్‌ తాజా “స్కాండల్‌”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్‌ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్‌ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్రంప్‌ను కేటరింగ్‌ బాక్స్‌లో దాచినట్లు చూపించే మీమ్‌ను కూడా షేర్‌ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.

కేటరింగ్‌ వాహనంలో రహస్య తరలింపు
జూలై 8న అంకారా నుంచి బ్రిటన్‌కు బయలుదేరే సమయంలో ట్రంప్‌, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్‌ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్‌ అధికారులు, వైట్‌హౌస్‌ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఈ ఆపరేషన్‌ వివరాలను తొలుత వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ట్రంప్‌ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్‌ అంతస్తు వరకు ఇరాన్‌కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్‌ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. 

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య ఘటన
అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్‌ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్‌పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్‌-అమెరికా.. ఇరాన్‌ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?
అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్‌ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్‌ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్‌ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement