కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు | Spanish Father Francisco Perez Photo Shoot Goes Viral | Sakshi
Sakshi News home page

కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు

Apr 8 2025 2:04 PM | Updated on Apr 8 2025 2:31 PM

Spanish Father Francisco Perez Photo Shoot Goes Viral

పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..

అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న  ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.

వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారు

దీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.

:: సిమ్మాదిరప్పన్న

Advertisement
 
Advertisement
Advertisement