హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం  | PM Narendra Modi Bilateral Talks with Seychelles President Patrick Herminie | Sakshi
Sakshi News home page

హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం 

Jun 29 2026 12:57 AM | Updated on Jun 29 2026 12:57 AM

PM Narendra Modi Bilateral Talks with Seychelles President Patrick Herminie

భారత్, సీషెల్స్‌ల ఉమ్మడి ఇల్లు ఈ సముద్రమే 

ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సముద్ర భద్రతే కేంద్రం  

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య 

సీషెల్స్‌ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మినీతో చర్చలు

విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్‌ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్‌లోని విక్టోరియా నగరంలో సీషెల్స్‌ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మినీతో సమావేశమయ్యారు.

 ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్‌ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు.  

వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ  
భారత్, సీషెల్స్‌ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు.  

వాతావరణ మార్పులపై పోరాడుదాం  
తర్వాత సీషెల్స్‌ నేషనల్‌ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్‌ సౌత్‌ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్‌ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. 

వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్‌ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.

19 కీలక అంశాలపై నిర్ణయం 
రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్‌ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్‌ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్‌ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. 

ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్‌ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. 

సీషెల్స్‌కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్‌ రేడియల్‌ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్‌ కాక్‌పిట్‌తో ఒక డోర్నియర్‌ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి.  దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ సరీ్వస్, సీషెల్స్‌ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.  

మోదీకి సీషెల్స్‌ గౌరవ పురస్కారం ప్రదానం  
ప్రధాని మోదీకి సీషెల్స్‌ ప్రభుత్వం ‘గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హొరైజన్‌’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్‌ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్‌ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్‌ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement