breaking news
Patrick
-
చేదు మేసి నెమరేసిన రచయిత!
‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు మాసపు అసురసంజ వేళల్లో ఏదో విద్యుద్వాహిని ప్యారిస్ వీథుల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు ముసురుపట్టి చినుకులు పడుతున్నా, నా మనసేం కుంగిపోదు! అలాగని కాలం పిట్ట రెక్కలమీద ఎగురుతున్నట్లూ అనిపించదు!!అలాంటి వేళల్లో ఏం జరిగినా జరగొచ్చని మాత్రమే అనిపిస్తుంది నాకు. నా వరకూ నాకు, అక్టోబరులోనే నూతన సంవత్సరానికి తెర తీస్తున్నట్లు భావిస్తాన’న్న రచయిత ఏ భావకవిగారో కాదు సుమా! అతగాడు ఫక్తు నవలా రచయిత! 2014లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ప్యాట్రిక్ మొద్యానా చారిత్రక కాల్పనిక నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు. ఆయన రాసిన నాలుగు పదులకు మించిన పుస్తకాలన్నింటా ప్రాథమిక ఇతివృత్తం దాదాపు ఒకటే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్ ప్రజలు పడ్డపాట్లకే ఒకింత కాల్పనికత మేళవించి, మొద్యానా ఈ నవలలు రాశాడు. ‘చేజారిన యవ్వనం కెఫేలో...’ అనే నవలలో రాసినవే పైన ఉట్టంకించిన మాటలు.రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు ఎనిమిది కోట్లమంది జనం ఉన్నవూరికీ, కన్నవారికీ, కట్టుకున్నవారికీ, కన్న బిడ్డలకూ, చేసుకునే వృత్తులకూ దూరమై అలమటించారు. ఈ యుద్ధానికి ప్రధాన రణక్షేత్రంగా ఉండిన యూరపులోనే ఇలాంటి బాధితుల సంఖ్య సగానికి సగం వుంటుంది. యుద్ధబాధితుల్లో సగానికి సగం మంది స్త్రీ– శిశు– వృద్ధులే! ముఖ్యంగా, వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో బంధితులైన స్త్రీపురుషుల సంతానం అకస్మాత్తుగా అనాథలుగా మారి, నడివీథిలో నిలబడవలసి వచ్చింది. అలాంటి వారిలో, 1945లో పుట్టిన మొద్యానా కూడా ఒకడు.ఈ యుద్ధం సందర్భంగానే, అరవై లక్షలమంది యూదులను ఊచకోత కోశారు. మొద్యానా తండ్రి ఆల్బెర్ట్ కూడా యూదు మతస్థుడే; ఇటాలియన్ కులీన వంశానికి చెందిన ఆల్బెర్ట్ నాజీలతో చేతులు కలిపినవాడు. అతని తల్లి లూయిజా ఫ్లెమిష్ (బెల్జియన్–డచ్) సాంప్రదాయిక నర్తకి. ఫ్రాన్స్ విదేశీ దురాక్రమణకు గురైన రోజుల్లో, 1942లో, వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రణయానికీ, పరిణయానికీ దారితీసింది. యుద్ధకాలంలో, మొద్యానా తండ్రి కార్లాంగ్ అనే ఫ్రెంచ్ గెశ్టాపో ఆశీర్వాద బలంతో– బ్లాక్ మార్కెట్లో వీరవిహారం చేశాడంటారు. కార్లాంగ్ సారథులు, నేర ప్రపంచంలో కొమ్ములు తిరిగిన దున్నపోతులై వుండడం వల్లనే, ఇది సాధ్యమైందని కూడా చెప్తారు!రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మొద్యానా తల్లితండ్రులు కారనేది వాస్తవం! అయితే ఆ యుద్ధ పరిణామాల వల్ల, మొద్యానా మాదిరిగా, ‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కూనలు’ ఎందరో అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందనే మాట కూడా వాస్తవమే మరి! అందుకే, మొద్యానా తన తల్లిదండ్రుల తరాన్ని జీవితంలో ఎన్నడూ క్షమించలేదు!! ఫ్రాన్స్‌లో చిన్నాపెద్దా ఊళ్ళకు కూడా మొద్యానా పేరును పరిచయం చేసిన ‘మాయమైన మనిషి’ లాంటి నవలలు మొదలుకొని ‘డారా బ్రూడర్’, ‘ముక్కలైన వాక్యాలు (మూడు నవలల సంపుటి)’, ‘కనిపించని సిరా’– ఇలా ఏ నవలను చూసినా ఇదే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత, అనేక భాషల్లోకి అనువాదమైన మొద్యానా 139 పుస్తకాలలో దేన్ని చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. పైపైన చూస్తే మొద్యానా రాసింది అపరాధ పరిశోధన సాహిత్యం అనిపిస్తుంది. అయితే, ఆ ‘అపరాధం’ చట్టాలు నిషేధించిన నేరాలు చేయడమే కాదు– స్త్రీలనూ, బాలలనూ– వృద్ధులనూ వేధించిన కండకావరం! దాన్ని నిరసించడానికే మొద్యానా తన సాహిత్య జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు. అయితే, ఆ విషయం వాచ్యంగా చెప్పకుండా, సాహిత్య మర్యాదలన్నీ పాటించడంలో మొద్యానా శిల్ప పరిణతి కనిపిస్తుంది. అందువల్లనే ఈ అపరాధ పరిశోధక రచయితకు నోబెల్ పురస్కారం దక్కింది!మొద్యానా చవిచూసిన చేదు అనుభవాల్లో, ఘోరాతి ఘోరమైన విషయాలున్నాయి. అతన్ని పెంచి పెద్ద చేయడం ‘పెనుభారం’గా అటు తల్లీ, ఇటు తండ్రీ కూడా భావించడం వాటిలో మొదటిది. సదరు భారాన్ని తమ నెత్తిమీంచి దించి, ఎదుటివారి నెత్తిన మోపేందుకు నానా పాట్లూ పడ్డం రెండో ఘోరం. సహాయం కోరి ఆశ్రయించిన పాపానికి, మొద్యానాను తాము విదిలించి పారేయడమే కాకుండా, తమ బాయ్ ఫ్రెండ్సూ– గర్ల్ ఫ్రెండ్సూ చేత కూడా అదే సత్కారం జరిపించడం ఘోరాతి ఘోరం! ఇంత జరిగిన తర్వాత, తన తల్లితండ్రుల తరాన్ని అసహ్యించుకున్నందుకు మొద్యానాను ఎవరైనా తప్పు పట్టగలరా? సొంత అనుభవాలే పూర్వరంగంగా ఆనాటి ఫ్రాన్స్‌లో రచయితగా మనగలగడం మజాకా కాదు.ఆధునిక ఫ్రెంచ్ వాడుకభాషను ఓ మలుపుతిప్పిన రేమన్ కెనో, మొద్యానా తల్లికి నేస్తం; మొద్యానాకు గురువు. అతని చలవతోనే, మొద్యానా తన తొలినవల ‘నక్షత్ర కూడలి’ అచ్చువేయించుకున్నాడు. అందులో ప్రధాన పాత్రలు మొద్యానా తండ్రిని పోలివుండడం మింగుడు పడనందువల్లనే ఆ పెద్దమనిషి సదరు నవల కాపీలు దొరికినన్ని కొనేసి తగలబెట్టేశాడట!‘దురాక్రమణ పాలైన ప్రాంతాల్లో జీవప్రపంచం అనుభవించిన స్థితిగతులనూ, ఎవరికీ బోధపడని మానవాళి భవితనూ సొంత జ్ఞాపకాల ప్రాతిపదికగా మన కళ్ళముందు ఉంచిన కళ మొద్యానా సొంతమ’న్నారు స్వీడిష్ ఎకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్. ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మొద్యానా మరెక్కడా ప్రాచుర్యానికి నోచుకోలేదని 2014లో పీటర్ ఇంగ్లండ్ అన్నమాట వాస్తవమే. అయితే యేం? నోబెల్ పురస్కారం కోసం నామినేట్ అయిన తొలిసారే, అతన్ని ఆ బహుమతి వరించడం కూడా వాస్తవమే మరి! - మందలపర్తి కిషోర్ -
హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం
విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్‌లోని విక్టోరియా నగరంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు. వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడుదాం తర్వాత సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.19 కీలక అంశాలపై నిర్ణయం రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. సీషెల్స్‌కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్ కాక్‌పిట్‌తో ఒక డోర్నియర్ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి. దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సరీ్వస్, సీషెల్స్ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీకి సీషెల్స్ గౌరవ పురస్కారం ప్రదానం ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్‌ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. -
రాబోయే రోగాలను ముందే గుర్తిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నం గురించి ప్రతిష్టాత్మక బయో ఆసియా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుగ్రహీత డాక్టర్ ప్యాట్రిక్ టాన్ సభికులతో పంచుకున్నారు. ‘సింగపూర్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రులపై ఒత్తిడి ఎక్కువవుతోంది. చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా బాగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఆరోగ్య రంగంలో ఖర్చులు తగ్గించుకోవడం ఎలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగానే ఇప్పుడు మేము భవిష్యత్తులో ఎవరు జబ్బు పడవచ్చో.. ఆ జబ్బులు ఎలాంటివో గుర్తించేందుకు.. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకొనేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టాం.ప్రిసైస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ‘నేషనల్ ప్రిసిషన్ మెడిసిన్ ప్రోగ్రామ్’కు నేను నేతృత్వం వహిస్తున్నా. ఇందులో భాగంగా ప్రజల జన్యు సమాచారంతోపాటు వారి ఆహార అలవాట్లు, వైద్య వివరాలు సేకరించాం. మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తులో ఎవరు జబ్బు పడతారో.. ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో, వాటికి చవకైన వైద్యం ఎలా అందుతుందో గుర్తించాం. ఈ రెండు అంశాలకు తగ్గట్లు ప్రభుత్వం బీమా, న్యాయపరమైన రక్షణ వంటి విధానాలను రూపొందించింది. సుమారు లక్ష మంది సింగపూరియన్ల వివరాలు సేకరించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకూ 97 వేల మంది ఈ కార్యక్రమంలో చేరారు. దేశ ప్రజలందరినీ గుర్తించేందుకు ఉన్న పద్ధతి (ఆధార్ వంటిది) ద్వారా వారిలో ఎవరు ఎక్కడ జబ్బు పడ్డా ఆ వివరాలు ఎలక్ట్రానిక్ రిజిస్టర్లో నమోదవుతాయి.ఏ జబ్బు వచ్చింది? ఏం మందులిచ్చారు? ఇతర వివరాలు ఏమిటన్నది తెలిసిపోతుంది. వాటిని విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో రాగల జబ్బులను గుర్తిస్తున్నాం. రోగులకు ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపైనా పనిచేస్తున్నాం. చివరి దశలో భాగంగా మొత్తం సింగపూర్ జనాభాలో 10 శాతం మంది నుంచి వివరాలు సేకరిస్తాం. అయితే వారు ఇప్పటికే ఏదో ఒక జబ్బు బారినపడి చికిత్స తీసుకుంటున్న వారై ఉంటారు. వీరి నుంచి సేకరించే సమాచారం వ్యాధి ఎలా ముదురుతోంది? దుష్ప్రభావాలు ఏమిటి వంటివి తెలుస్తాయి.మొత్తమ్మీద ఇంకో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన పురోగతి సాధించగలమని ఆశిస్తున్నాం’ అని ప్యాట్రిక్ టాన్ వివరించారు. -
ఇక భారత్‌లో ‘టోటల్’ పెట్రోల్ బంకులు!
► స్థానిక భాగస్వామ్యంపై ఆసక్తి ► కంపెనీ సీఈవో పాట్రిక్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో ఇంధన రిటైల్ వ్యాపారంలో ఉన్న అపార అవకాశాలపై ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎస్‌ఏ కన్నేసింది. స్థానికంగో ఓ భాగస్వామితో కలసి పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు టోటల్ వెల్లడించింది. టోటల్‌ఎస్‌ఏ ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో లూబ్రికెంట్లు, ఎల్పీజీని విక్రయిస్తోంది. ‘‘ఇది చాలా పెద్ద మార్కెట్. ఇండియన్ ఆయిల్ తదితర పెద్ద సంస్థలు వేలాది రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యే ఈ మార్కెట్‌ను నియంత్రణల నుంచి తప్పించారు. దీంతో ఈ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం’’ అని టోటల్ సీఈవో పాట్రిక్ పోయెన్నే తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నామని, సరైన భాగస్వామిని గుర్తించాల్సి ఉందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఈ రంగంలో మాది అతిపెద్ద కంపెనీ. మా దగ్గర నిధులు, ఆర్థిక సామర్థ్యం ఉంది. ఈ వ్యాపారంలో నైపుణ్యం కూడా ఉంది’’ అని వివరించారు. పాట్రిక్ అంతకుముందు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ సమావేశమయ్యారు. ఎల్పీజీ నిల్వ, దిగుమతి టెర్మినళ్లు, పంపిణీపై పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తరఫున టోటల్‌కు సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తామని ప్రధాన్ హామీ ఇచ్చారు.


