బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం! | Diplomatic Shock in Switzerland: Pak PM Stunned JD Vance Hit by Setback | Sakshi
Sakshi News home page

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

Jun 22 2026 10:46 AM | Updated on Jun 22 2026 10:56 AM

Diplomatic Shock in Switzerland: Pak PM Stunned JD Vance Hit by Setback

స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్‌, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్‌ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. 

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌ రిసార్ట్‌లో జరిగిన అమెరికా-ఇరాన్‌ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్‌, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్‌ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.

ముందుగా నిర్ణయించిన హ్యాండ్‌షేక్‌, జాయింట్‌ ఫోటో సెషన్‌లో ఇరాన్‌ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్‌ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్‌ బాఘేర్‌ ఘాలిబాఫ్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఫోటో-ఆప్‌ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్‌ బృందం వేదిక నుంచి వాకౌట్‌ చేయడంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్‌ షరీఫ్‌, అసిమ్‌ మునీర్‌ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్‌ ప్రతినిధుల వాకౌట్‌ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్‌కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్‌ ప్రతినిధి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ను పలకరించి జేడీ వాన్స్‌ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్‌ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్‌ ప్రతినిధి చేసిన పనితో పాక్‌ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్‌ మీడియాలో “ప్రోటోకాల్‌ స్నబ్‌”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.

ఇక.. మీటింగ్‌ హాల్‌లోకి ఇరాన్‌ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్‌, జారెడ్‌ కుష్నర్‌, స్టీవ్‌ విట్‌కాఫ్‌తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్‌ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్‌ ఉల్లంఘనా?”, “ఇరాన్‌ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్‌గా మారాయి.

అయితే మరోవైపు ఖతార్‌, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్‌ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్‌ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్‌ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.

మొత్తం మీద, స్విట్జర్లాండ్‌ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్‌ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement