మళ్లీ భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్‌ | Ceasefire in Lebanon Collapses Within Hours Amid Fresh Israeli Strikes | Sakshi
Sakshi News home page

మళ్లీ భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్‌

Jun 20 2026 11:47 AM | Updated on Jun 20 2026 11:56 AM

Ceasefire in Lebanon Collapses Within Hours Amid Fresh Israeli Strikes

పశ్చిమాసియాలో శాంతి దిశగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఒప్పందం మొదటి దశలోనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అమెరికా, ఇరాన్, ఖతార్‌ మధ్య ఒత్తిళ్లతో.. ఇజ్రాయెల్–హెజ్‌బోల్లా దిగి వచ్చాయి. దీంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్‌లోని నబాటియే ప్రాంతంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ భీకర దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్‌ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) తెలిపింది. తెల్లవారుజామున కూడా బాంబుల వర్షం కొనసాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మొన్న ఇజ్రాయెల్–హెజ్‌బోల్లా మధ్య జరిగిన భీకర పోరులో లెబనాన్‌లో కనీసం 47 మంది మృతి చెందగా, ఇజ్రాయెల్ తరఫున నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

తాజా దాడులపై ఇజ్రాయెల్‌ స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రతిస్పందనగానే జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హెజ్‌బోల్లా మిలిటరీ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నామని, భద్రతా ముప్పులు ఉన్న ప్రాంతాల్లో ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో హెజ్‌బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేస్తూ, ఒప్పందాన్ని వారే ఉల్లంఘించారని పేర్కొంది.

దౌత్య ప్రయత్నాలకు ఎదురుదెబ్బ
ఈ తాజా దాడులు ప్రాంతీయ దౌత్య ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లెబనాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా–ఇరాన్ చర్చలు వాయిదా పడ్డాయి. చర్చల్లో పాల్గొనాల్సిన ఇరాన్ ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకోగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన పర్యటనను నిలిపివేశారు. అయితే ఒప్పందం కుదిందన్న ప్రకటనల తర్వాత.. మళ్లీ చర్చలు జరగొచ్చని భావించారు. ఈలోపే మళ్లీ దాడులు జరగడం గమనార్హం.

ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం హార్మూజ్ జలసంధి పునరుద్ధరణకు దారితీసినా, తాజా ఘర్షణలు ఆ శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితిని పెంచుతున్నాయి. శాంతి ఒప్పందంతో ఇరాన్‌కు పెద్దగా లాభం(10 శాతానికి మించి కూడా) చేకూరదని ట్రంప్‌ వ్యాఖ్యానించడం.. అదే సమయంలో హర్ముజ్‌లో నౌకల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వంటి కొత్త నిబంధనలు కూడా అమలులోకి రావడంతో పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తతల వైపు మళ్లించేలా కనిపిస్తున్నాయి. ఈలోపు.. 

ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం, మరోవైపు గంటల్లోనే మళ్లీ ప్రారంభమైన దాడులు… పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఈ ఒప్పందం నిజంగా నిలుస్తుందా? లేదంటే మళ్లీ ఘర్షణల చక్రం తిరుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్నగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement