వాషింగ్టన్: భారతీయ అమెరికన్ సహా 40 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికాలో రంగం సిద్ధమైంది. విదేశీ ప్రభుత్వాల ఏజెంట్‌గా పని చేయడం, హత్య వంటి నేరాల్లో దోషులుగా తేలడంతో వీరి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 40 మంది వ్యక్తులపై, పలు యు.ఎస్. జిల్లా కోర్టులలో పౌరసత్వాన్ని రద్దు చేసే చర్యలను దాఖలు చేసినట్లు న్యాయ శాఖ ప్రకటించింది. 2026 ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 2 మధ్య దాఖలైన ఈ ఫిర్యాదులు, ట్రంప్ పరిపాలనలో ఒకే కాలంలో దాఖలైన అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను సూచిస్తున్నాయి.
అమెరికాలోకి ప్రవేశించేందుకు, పౌరసత్వాన్ని పొందేందుకు తప్పుడు గుర్తింపు పత్రాలు చూపినందుకు కాలిఫోర్నియాకు చెందిన బల్విందర్ సింగ్‌పై వేటు పడనుంది. న్యాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బల్విందర్ సింగ్ 1992లో ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఇంకో గుర్తింపుతో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసి స్వీకరించాడు కూడా. వేలిముద్రలు ద్వారా ఈ రెండు దరఖాస్తులను బల్విందర్ సింగ్ చేసినట్లు స్పష్టమైంది. 2009లో రెండో గుర్తింపు ఆధారంగా బల్విందర్ సింగ్ నాచురలైజేషన్ మార్గంలో అమెరికా పౌరుడు అయ్యాడు. అయితే కనీసం ఏడు సందర్భాల్లో అతడు తన గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, ఇది అతడి నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని న్యాయ శాఖ తెలిపింది.
బల్విందర్ సింగ్‌తోపాటు జిన్‌చావ్ వీని చైనా తరఫున గూఢచర్యానికి పాల్పడ్డ కారణంగా పౌరసత్వం రద్దు చేయనున్నారు. చైనాలో పుట్టి 2021లో అమెరికాలో నావికా దళంలో చేరిన ఇతడు 2022 నుంచే గూఢచర్యానికి పాల్పడ్డాడని, మిలటరీ రహస్యాలను చైనాకు అందించాడని న్యాయ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ దళాల్లో పనిచేస్తున్నందుకు ఇతడికి పౌరసత్వం కూడా చాలా తొందరగా లభించిందని తెలిపారు.
ఇదీ చదవండి: రూ. 60 లక్షలు : థాయ్ మహిళ-యూపీవాలా సోషల్ మీడియా లవ్
పౌరసత్వంపై వేటు పడనున్న ఇతరుల్లో పాకిస్థాన్, మెక్సికో, కంబోడియా, నేపాల్, అఫ్ఘనిస్తాన్‌లకు చెందిన వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంత మందిపై ఒకేసారి డీనాచురలైజేషన్ ప్రక్రియ నడవడం ఇదే మొదటిసారి. అమెరికాలో కొంతకాలం జీవించిన తరువాత అతడికి పౌరుడిగా గుర్తించడాన్ని నాచురలైజేషన్ అంటారు. అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ఈ నాచురలైజేషన్ ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరిగినట్లు రుజువైతే రద్దు చేయవచ్చు.
ఇదీ చదవండి: నో షూస్, నో సూట్..1600 మీటర్ల రన్, అదీ చీరలో


