మినుము సాగు.. మిగులు బాగు! | - | Sakshi
Sakshi News home page

మినుము సాగు.. మిగులు బాగు!

Jul 20 2026 1:44 AM | Updated on Jul 20 2026 1:44 AM

మినుము సాగు.. మిగులు బాగు! తెనాలి: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన రైతు రామకృష్ణ వంద ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెద్దగా అందుబాటులోని లేని ప్రాంతమది. వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆచరణలోకి తెస్తున్నారు. నీటి వసతి పెద్దగా లేని పంట భూమిలో తక్కువ నీటితో ఖరీఫ్‌లో వరి సాగు తర్వాత రెండో పంటగా మినుముకు మాత్రమే అవకాశం. అలాంటిి చోట రెండు పంటల తర్వాత మూడో పంటగానూ 50 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ‘రెండు పంటలే కనాకష్టంగా వస్తాయి... మూడోపంట ఎక్కణ్ణుంచి వస్తుంది?’ అంటూ వెనక వెటకారాలు ఎదురైనా పట్టించుకోలేదు. జూన్‌, జూలై నెలల్లోనూ వేసవిని తలపించే ఎండలు, తేమ లేని వేడిమి వాతావరణంలో సైతం దిగుబడి ఆశాజనకంగా కనిపించింది. కొద్ది రోజులుగా మిషనుతో నూర్పిడి చేయిస్తున్నారు. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడిని చూసుకుని మురిసిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మినుములు క్వింటాలు రూ.10 వేల ధర పలుకుతున్నందున అన్ని ఖర్చులు కలిపి ఎకరాకు రూ.15 వేలు పోగా... రూ.35 వేల ఆదాయం వస్తుందని భరోసాగా ఉన్నారు. ఇదే తరహాలో వరినాట్లకు కూలీలతో పనిలేకుండా ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నారు. పంటకు నీరిచ్చేందుకు సాధారణ నీటి ఇంజినుకు బదులుగా ప్రత్యేకంగా ఒక్కో ఫ్రేమ్‌పై నాలుగు అంగుళాల పైపులతో రెండు ఇంజిన్లను ట్రాక్టరు వెనుక బిగించుకున్నారు. ఒక్కో ఇంజినుకు రెండేసి పైపులు. ఆ పైపులు నీటిని తోడుతుంటే మరో రెండు పైపుల నుంచి చేలోకి నీరు వెళుతుంటుంది. సాధారణ ఇంజినుతో రోజుకు రెండెకరాలు తడపగలిగితే అదే 20 లీటర్ల డీజిల్‌తో రోజుకు పదెకరాల వరకు నీరు పెడుతున్నారు. అలాగే పంటలకు ఆశించే పురుగుమందుల నివారణకు ప్రత్యేకంగా భారీ స్ప్రేయర్లను ట్రాక్టరు వెనుక అమర్చుకుని పిచికారీ చేయించటం మరో ప్రయోగం. ఇన్ని సదుపాయాలతో కూలీల భారం తక్కువ ఉంటోంది. తక్కువ నీటితో, పరిమిత వ్యయంతో ఎక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. పొలంలో కలుపు సమస్య దాదాపు ఉండదని రామకృష్ణ చెబుతారు. తన యంత్రాలన్నింటినీ సొంత వ్యవసాయానికి వినియోగిస్తూ, పంటల సాగును సులభతరం చేసుకున్నారు. తోటి రైతులకు స్వల్ప లాభంపై అద్దెకిస్తూ రెండు విధాలుగా ఆదాయాన్ని ఆర్జిస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సాంకేతికత వినియోగంతోనే...

నీటి ఎద్దడి, కూలీల భారంతో రామకృష్ణ చాలాకాలంగా పంటల సాగులో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భూమిని చదును చేసేందుకు రూ.4 లక్షల ‘లేజర్‌ లెవెలింగ్‌ మిషను’ను గుజరాత్‌ నుంచి తెప్పించారు. 55 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఈ మిషనును ట్రాక్టరుకు బిగించి కంప్యూటర్‌లో కావల్సిన లెవెల్‌ను ఫిక్స్‌ చేసి, ట్రాక్టరును నడుపుతుంటే ఆ ప్రకారమే రోజుకు 10 ఎకరాల భూమిని చదును చేస్తోంది. తన అవసరాలు పోగా గంటకు రూ.1,700 చొప్పున ఇతర రైతులకు అద్దెకిస్తున్నారు. డిమాండ్‌ పెరగటంతో ప్రస్తుతం నాలుగు మిషన్లను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూమిలో ఎగుడుదిగుడు, కలుపు సమస్య ఉండదు. నీరు పెడితే భూమి మొత్తానికి సమాంతరంగా అందుతుందని రామకృష్ణ చెప్పారు.

వరినాట్లకు కూడా...

సంప్రదాయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడుతూ పంటలు సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో అధికలాభాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు మల్లెపెద్ది రామకృష్ణ. తక్కువ నీటితో కూలీల ఖర్చు లేకుండా వరిసాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రబీ సాగు అనంతరం 50 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా మూడో పంటగా మినుము వేశారు. కేవలం రూ.15 వేల పెట్టుబడితో ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. మార్కెట్‌ ధరతో ఎకరాకు ఖర్చులు పోను రూ.35 వేల ఆదాయాన్ని తీస్తున్నారు. మిషనుతో నూర్పిడి చేస్తూనే ఖాళీ అయిన భూమిని జీరో లెవెలింగ్‌ చేస్తూ ఖరీఫ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ రైతు విజయం స్ఫూర్తిదాయకం.

50 ఎకరాల్లో తక్కువ

వ్యయంతో మూడో పంట

ఎకరాకు రూ.35 వేల వరకు లాభం

అభ్యుదయ రైతు రామకృష్ణ ప్రయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement