మాట్లాడుతున్న వరుదు కల్యాణి, విడదల రజిని, నూరి ఫాతిమా, భాగ్యలక్ష్మి, హారిక తదితరులు
రౌడీల్లా మారిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
వారికి చుట్టాల్లా వ్యవహరిస్తున్న పోలీసులు
టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి
కీచకుడిలా వ్యవహరించాడు
వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆగ్రహం
బాధితురాలిని పరామర్శించి ఓదార్చిన నేతలు
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, పోలీసులు వారికి చుట్టాల్లా మారారని ధ్వజమెత్తారు. గుంటూరు కృష్ణబాబుకాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి మహిళను వివస్త్రను చేసిన సంఘటనలో బాధితురాలిని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఆమె నివాసానికి వెళ్లిన మహిళా నేతలు జరిగిన ఘటన గురించి బాధితురాలితో మాట్లాడి, ఆమెకు ధైర్యం చెప్పారు.
అధైర్యపడవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తాము వచ్చామని, న్యాయం జరిగే వరకూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాబు పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ, ‘బోరు పంపు రిపేరు కోసం టీడీపీ నేత మల్లెల మూర్తి అడిగిన రూ.10 వేలు ఇవ్వనందుకు ఒక మహిళపై తన కుటుంబంతో సహా తొమ్మిది మంది దాడికి పాల్పడడం దారుణం.
మహిళా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే ఒక మహిళపై ఇంత అమానుషం చోటుచేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుచేటు. సీసీ కెమెరాలు ఉండటం వల్లనే ఈ కేసు పెట్టారు. లేదంటే కేసే ఉండేదికాదు. రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగం అన్నా, చట్టం అన్నా ఎటువంటి భయం లేకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అచ్చోసిన అంబోతుల్లా రెచ్చిపోతున్నారు. గుంటూరు ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పులు చేస్తున్న వారిని రక్షించుకుంటూపోతే 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తాం’ అని హెచ్చరించారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని.. వాటిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగనున్నట్లు ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


