
అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి కీలకం
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి చాలా కీలకమని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొందరు వ్యక్తిగత కక్షలతో తప్పుడు అర్జీలు ఇస్తున్నారని, అటువంటి వారిపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కోర్టు కేసులకు సమాధానాలను నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలని అధికారులకు చెప్పారు. అవసరమైన మేరకు లీగల్ టీం సహాయం తీసుకోవాలని తెలిపారు. సమస్యలపై అర్జీలను ప్రజలు స్థానిక మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం వచ్చిన 287 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
ప్రభుత్వ వైఖరి మారాలి
జిల్లా వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తక్షణం సంక్షేమ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి. కార్మికులను రావాల్సిన సహాయాలను అందించాలి. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
–పుప్పాల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
విద్యుత్ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరికి చెందిన శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించిన రూ.42 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే వసూలు చేయాలి. అలసత్వం వహించిన విద్యుత్ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి.
–షేక్ సుభాని,
ముస్లిం సేన రాష్ట్ర అద్యక్షులు
అవగాహనతోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి
గుంటూరు వెస్ట్: ప్రతి ఒక్కరి జీవితంలోనూ వైవాహిక బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, దాన్ని ప్రారంభించే ముందు ఇద్దరికి పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివాహానికి ముందు కౌన్సెలింగ్ అనేది రానున్న భవిష్యత్తుకు మార్గదర్శకంలా పని చేస్తుందని తెలిపారు. దీనివల్ల ముందుగానే ఆర్థిక అంశాలు, ఇరు వర్గాల కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఒకరికొకరు సంయమనంతో వ్యవహరిస్తే చాలా సమస్యలు నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి ప్రసూన పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి కీలకం

అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి కీలకం