
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీ(40)తో సన్నిహితంగా ఉంటూ కనిపించారాయన. రెండురోజుల వ్యవధిలో.. రెండుసార్లు జంటగానే వాళ్లు కెమెరాకు చిక్కారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
కెనడా (Canada) ప్రధాని పదవి నుంచి ట్రూడో జనవరిలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మీడియా కంట పడుతోంది చాలా తక్కువే. మరోవైపు.. తన కొత్త ఆల్బమ్ 143 ప్రమోషన్స్ కోసం పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో..
వీరిద్దరూ మాంట్రియల్‌లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. తాజాగా.. జులై 28వ తేదీన ఈ జంట ప్రైవేట్ డిన్నర్‌కు వెళ్లింది. ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కూర్చొని వీరిరువురూ విందు ఆరగించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత సమయం మాట్లాడుకున్నారు. ఆపై రెస్టారెంట్‌లోని కిచెన్‌ను పరిశీలించి సిబ్బందికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి.. సమీపంలోని ఓ బార్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించారు. ఆ టైంలో వీరు కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.
ఆ మరుసటిరోజు.. మౌంట్ రాయల్ పార్క్‌లో గంటకు పైగా జంటగా వాకింగ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో ట్రూడో, పెర్రీలు డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ట్రూడో, పెర్రీ తరఫున ఎవరూ ఖండించలేదు.
ట్రూడో(53) తన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ఈ విషయం వెల్లడించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అటు పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్ బ్లూమ్‌తో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది.వీళ్లది స్నేహమా? లేదంటే రొమాంటిక్ రిలేషనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.