తనను తాను విమాన పైలట్‌గా పరిచయం చేసుకుంటాడు... ఎయిర్ పోర్టు నుంచి లోపలికి వెళ్లేదాకా ఐడీ కార్డులు చూపిస్తూ దర్జాగా విమానంలోకి ప్రవేశిస్తాడు. లోపల విమానం కాక్‌పిట్‌లో ప్రత్యేకంగా ఉండే జంప్‌సీట్ కావాలని పట్టుబట్టి ఆ సీట్ మీద కూర్చుని ప్రయాణం చేస్తాడు. ఇలా ఒకటి.. రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు అతను వేర్వేరు విమానాల్లో ప్రయాణించాడు.
కెనడా ఎయిర్ లైన్స్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి.. మానేసిన తర్వాత ఎయిర్ లైన్స్‌లో ఉండే లొసుగులను బాగా వంట పట్టించుకున్న 33ఏళ్ల డల్లాస్ పోకోర్ని ఈ మోసపు దందాకు తెర లేపాడు.
2024 జనవరి నుంచి అదే ఏడాది అక్టోబర్‌ల మధ్య నకిలీ ఐడీలు చూపి.. ప్రయాణాలు చేశాడు. మూడు ప్రధాన విమానయాన సంస్థలను తన మోసానికి టార్గెట్ చేసుకుని అందులో ప్రయాణించాడు.
కేవలం ప్రయాణం మాత్రమే కాదు... విమానంలో సాధారణంగా... పైలట్లు... FAA ఇన్‌స్పెక్టర్‌లు, నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అధికారులకు మాత్రమే అనుమతి ఉన్న జంప్‌సీట్‌ను డిమాండ్ చేసి ఆ సీటుపై ప్రయాణించాడు.
ఎట్టకేలకు అనుమానం వచ్చిన అధికారులు అతని ప్రయాణాలపై ఆరా తీశారు. అతను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్టు చేయడంతో అతని పూర్తి బాగోతం బయట పడింది. వెంటనే పనామాలో అతన్ని అరెస్టు చేశారు. హవాయిలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపారు.
దోషిగా తేలితే... అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.


