
ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన
గుంటూరు మెడికల్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని జిల్లా జైలులో 250 మంది ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు కళ్లెతోపాటు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధి ఉన్న మందుల కోర్సు వాడడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గే సమయంలో నోటికి కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.శాంతరాజు, వైద్య అధికారిణి డాక్టర్ లక్ష్మీసుధ, సిబ్బంది నాగజ్యోతి, స్వరూప, రాంబాబు, సాంబశివరావు, నాగమణి, సంధ్యారాణి పాల్గొన్నారు.