
ఆగస్టు 1న 5కే వాక్
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1న 5కిలో మీటర్ల మారథాన్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 5కే వాక్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో 17 నుంచి 25 సంవత్సరాల విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు విద్యార్థినులు పాల్గొనవచ్చన్నారు. పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7వేలు నగదు అందజేస్తామన్నారు. గోరంట్లలోని చిల్లీస్ వద్ద ఆగస్టు1న ఉదయం 6 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. పూర్తి వివరాలకు 73823 88088, 98498 54221 నంబర్లలో సంప్రదించాలన్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరునికి
నాగపంచమి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్‌శర్మ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజల్లో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
విజయకీలాద్రిపై
ఘనంగా గరుడ పంచమి
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన జీయర్‌స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.
75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం
పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్‌ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు డీఈఓ ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంఓ పూర్ణచంద్ర రావులు పాల్గొన్నారు.
నేడు శివాలయంలో
హుండీ కానుకల లెక్కింపు
పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు.

ఆగస్టు 1న 5కే వాక్

ఆగస్టు 1న 5కే వాక్