
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గుండాలు ఓవైపు.. మరోవైపు పోలీసులు సైతం వేధించగా.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారాయన.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైఎస్సార్‌సీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్‌కు తెలిపారు.
మరో వైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి.. కమ్మ కులంలో పుట్టి.. రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాకే జగన్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారాయన.
లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన వైఎస్ జగన్.. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు జగన్‌ను కలిసినవాళ్లలో ఉన్నారు.
