
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు.
లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?.
లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్‌లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారు
ముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్‌కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది.
మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు
లిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు..

.. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్‌ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్‌ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట..
.. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు.
ప్రజల్లోకి వెళ్లడానికి జగన్‌కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్‌కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.
ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా?