
ప్రతిపక్ష నేత పర్యటనపై ఇన్ని ఆంక్షలెందుకు?
జనంలోకి వెళితే ఉలుకెందుకు బాబు
నీ పాలనపై వస్తున్న వ్యతిరేకతను ఇలాంటి చర్యలతో ఆపగలవా?
నువ్వు .. నీ కొడుకూ ఆనాడు జనంలోకి వెళ్లలేదా?
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా?. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ల కంపమీద కూర్చోబెట్టినట్లు ఉంటుందా?. ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్రనిప్పులు కురుస్తున్నట్లు భయమేస్తోందా?. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్.. ఇన్ని నిబంధనలు విధిస్తోందా?..
వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం అంగీకరించలేకపోతోంది. ఆయన ఏ ఊరు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి పర్యటనల మీద గతంలో ఎన్నడూ లేనన్ని నిబంధనలు విధించడం అంటే ఆయన్ను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్లు కాదా?. చుట్టూ కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మేఘాలను చెదరగొట్టేందుకు.. ప్రజల గొంతుకు ఆయన మరింత మద్దతు తెలపకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతోందా?.
వైఎస్ జగన్‌ను జనంలోకి వెళ్లకుండా ఆపడానికి ఇలా ఆంక్షలు విధిస్తోందా అనే అభిప్రాయాలూ జనంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను నమ్మించి గెలిచినా ప్రభుత్వం ఆ దిశగా చేసింది ఏమీ లేదన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలు చేయలేదు. రైతులకు.. యువతకు.. విద్యార్థులకు.. మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను సైతం రాత్రికి రాత్రి పోలీసులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ పెద్దలను సంతృప్తి పరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును.. పోలీసులు చేస్తున్న అతిని హైకోర్టు కూడా పలుమార్లు అభిశంసించింది.
ఇక, అరటి.. మామిడి.. మిర్చి.. పొగాకు.. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వారి ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయక.. ఇటు వ్యాపారాలు సిండికేట్ అవడంతో ధర ఘోరంగా పడిపోయి రైతులు నష్టపోయారు. ఇటు సామాజిక.. రైతుల అంశాలతోపాటు ప్రభుత్వ వేధింపులతో నష్టపోతున్న కార్యకర్తలను ఓదార్చేందుకు.. నైతిక మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా అయన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎన్నడూ లేని అడ్డంకులు కలిగిస్తోంది. మొన్న పల్నాడు వెళ్లాలనుకున్నపుడు కూడా ఇలాగే నిబంధనల సంకెళ్లు విధించింది. నేడు నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం జగన్ వెళ్లబోగా రూల్స్ పేరిట కట్టడి చేస్తోంది.
గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం దూషించలేదా?. నాటి ప్రభుత్వాన్ని.. అధికారులను.. పోలీసులను దునుమాడలేదా?. లోకేష్ అయితే ఏకంగా రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ కొసకు నడుస్తూ అడుగడుక్కీ వైఎస్ జగన్‌ను తిడుతూనే వెళ్లారు. మరి నాడు ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టలేదు కదా. మరి నేడు చంద్రబాబు ప్రభుత్వం జగన్‌ను చూసి ఇంతగా ఎందుకు కలవరపడుతోంది. తమ ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాల మీద ప్రజలు జగన్ కలుస్తున్నారని భయమా?. గెలిచినా ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గని జగన్ మళ్ళీ సమాజంలో తిరిగితే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని కలవరమా?.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఎప్పటికీ ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడం అంటే అది నియంతృత్వమే అవుతుంది. ఇక ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా.. నిబంధనలు విధించినా వాటిని తెంచుకుని వెళ్తాము అంటూ వైఎస్ జగన్, ఆయన కార్యకర్తలు అయితే ముందడుగు వేస్తున్నారు..
-సిమ్మాదిరప్పన్న.