
సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్‌పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.
‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్ తరపు న్యాయవాది వివరించారు.
సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. 2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
తురకా కిషోర్‌పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్‌పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
