
నాణ్యమైన విద్యుత్ అందించండి
పొన్నూరు: విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. మంగళవారం నిడుబ్రోలు పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో రూ. 58.2 లక్షల ఖర్చుతో చేపట్టిన ఫీడర్ ఆధునికీకరణ పనులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి సీఎస్ పరిశీలించారు. సబ్ స్టేషన్ నుంచి అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వున్న సర్వీసుల వివరాలు లోడ్, ఏఏ గ్రామాలకు సరఫరా చేస్తున్న వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వున్న అన్ని ఫీడర్లలో వున్న వ్యవసాయ, వ్యవసాయేతర సర్వీసులు వేరు చేస్తున్న ఫీడర్ బైఫర్‌కేషన్ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేసి గ్రామాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పొన్నూరు మండలంలోని వడ్డిముక్కల గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తయిందని వ్యవసాయానికి పగటిపూట నిరంతరం 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ శాఖ సీజీఏం హెచ్‌ఆర్ డి.లింగమూర్తి, పీడీ టీవీఎస్‌ఎన్ మూర్తి, టెక్నికల్ డైరెక్టర్ మురళి కృష్ణ యాదవ్, ఈఈలు భాస్కరరావు, మల్లిఖార్జున రావు, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె. విజయానంద్
నిడుబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శన