
సీటీ స్కాన్‌కు గ్రహణం
తెనాలి అర్బన్: స్థానిక జిల్లా వైద్యశాలలో సీటీ స్కాన్ యూనిట్‌కు గ్రహణం పట్టింది. మూలన పడి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. నేటికి నూతన యూనిట్ ఏర్పాటుకు అడుగులు పడలేదు. సెకండరీ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రమేష్‌నాథ్ శనివారం పరిశీలించి, నూతన యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించడంతో ఆశలు చిగురించాయి.
పేదలకు వైద్యసేవలు
తెనాలి జిల్లా వైద్యశాలలో 250 పడకలు ఉన్నాయి. అదే ఆవరణలో తల్లీ పిల్లల వైద్యశాల 150 పడకలతో ఏర్పాటు చేశారు. నిత్యం రోగులతో ఆస్పత్రి రద్దీగా ఉంటుంది. గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వేమూరు, అవగనిడ్డ, రేపల్లె అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని పేదలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు.
కోవిడ్ సమయంలో విస్తృత సేవలు
తెనాలి జిల్లా వైద్యశాలలో 2008 నవంబర్ 14న సీటీ స్కానింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిరంతర సేవలు అందించింది. రోజూ 20 మందికి దాకా స్కానింగ్ చేసేవారు. కోవిడ్ ప్రారంభమైన సమయంలో, నిర్ధారణ కిట్స్ పంపిణీలో జాప్యం జరిగినప్పుడు సీటీ స్కాన్‌ను ఆధారంగా చేసుకుని వైద్యులు సేవలు అందించారు. ఆ తర్వాత యూనిట్ మొరాయించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంటనే బాగు చేయించారు. ఆ తర్వాత అది కొద్దినెలలకే ఆటకెక్కింది. టెక్నీషియన్‌లు వచ్చి పరిశీలించారు. పరిమితికి మంచి ఉపయోగించారని, దాన్ని బాగు చేయడం కష్టమని తేల్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు జిల్లా వైద్యశాలలో పర్యటించారు. అన్ని విభాగాలు పరిశీలించారు. ఆ సమయంలో నిర్వహించిన సమీక్షలో సీటీ స్కాన్ యూనిట్ పాడైందని, దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రి అధికారులు వారి దృష్టికి తెచ్చారు. టెక్నీషియన్‌కు చూపించాలని, పనికిరాదని నిర్ధారణ అయితే తనకు తెలియజేయాలని కేంద్ర మంత్రి ఆప్పట్లో సూచించారు. తర్వాత యూనిట్‌ను పరిశీలించిన టెక్నీషియన్లు పనికిరాదనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది జరిగి నెలలు దాటుతున్నా నూతన యూనిట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం కాలేదు.
జాయింట్ కమిషనర్ పర్యటనతో
చిగురించిన ఆశలు
సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఎస్. రమేష్ నాథ్ శనివారం తెనాలి జిల్లా వైద్యశాలలో పర్యటించారు. ఆ సమయంలో సీటీ స్కాన్ యూనిట్‌ను పరిశీలించి, దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది పనికిరాదని అధికారులు తెలపడంతో వెంటనే నూతన యూనిట్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అ సమయంలో ఆయన వెంట ఉన్న అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. ఒక ఫార్మెట్ ఇచ్చి, దీని ప్రకారం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
రోగులకు అవస్థలు
తెనాలి జిల్లా వైద్యశాలకు రోజూ వెయ్యి మంది దాకా రోగులు అవుట్ పేషెంట్లుగా, 200 మంది ఇన్ పేషెంట్స్ చికిత్స పొందుతుంటారు. అదే ఆవరణలోని తల్లీపిల్లల వైద్యశాలలో 200 మంది అవుట్ పేషెంట్లు, 100కు పైగా ఇన్ పేషెంట్స్ చికిత్స పొందుతుంటారు. వీరిలో చాలా మందికి సీటీ స్కాన్ సేవలు అవసరం. ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల పేదలపై ఆర్థిక భారం పడుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన సీటీ స్కానింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెనాలిలోని జిల్లా వైద్యశాలలో మూలన పడిన యూనిట్ ఎనిమిదేళ్లుగా నిలిచిన సేవలతో పేద రోగులపై ఆర్థికభారం సెకండరీ హెల్త్ జాయింట్ డైరెక్టర్ తనిఖీతో ఆశలు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు
నూతన యూనిట్ మంజూరు కోసం ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపాం. ఇటీవల ఆస్పత్రిలో పర్యటించిన జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు మరలా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఉన్నతాధికారులు యూనిట్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ డి.వి.రంగారావు, డీసీహెచ్‌ఎస్, గుంటూరు

సీటీ స్కాన్‌కు గ్రహణం

సీటీ స్కాన్‌కు గ్రహణం