
ఎంఈఓల నియామకాన్ని ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న స్కూల్ అసిసెంట్లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పీఆర్‌టీయూ, ఆపస్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకతో పాటు ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలిసిన ఆయా సంఘాల నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎంఈవో–1 పోస్టుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్లను నియమించారని, ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసుకు అనుగుణంగా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల అనేక విధాలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ విద్యాశాఖాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఎంఈవో–1లుగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను నియమిస్తూ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు విస్మరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులను కామన్ సీనియార్టీ ప్రాతిపదికన ఎంఈవోలుగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులను కలిసిన వారిలో ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) జిల్లా అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ పమిడి పద్మ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జువ్వా జ్ఞానేశ్వరరావు ఉన్నారు.