
కాలువల్లో పూడికతీసి రైతులను ఆదుకోవా లన్నందుకు దాషీ్టకం
దీక్షకు అనుమతి లేదంటూ పిడిగుద్దులతో కుళ్ల»ొడిచిన వైనం
కూటమి నేతల సూచన మేరకే దౌర్జన్యం
అరెస్ట్ నెపంతో స్టేషన్‌కు ఎత్తుకెళ్లిన పోలీసులు
స్పృహ తప్పి పడిపోయిన వైఎస్సార్‌సీపీ నేత
రేపల్లె/బాపట్ల/సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్‌బాబుపై రేపల్లె పట్టణ పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్‌కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు.
పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్‌లో స్పృహ తప్పి పడిపోయారు. వరికూటి అశోక్‌బాబుపై రేపల్లె పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టాయి. పోలీసుల దాడిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన పోరాడుతున్న అశోక్‌బాబుపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై వేమూరు, రేపల్లె వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.
రైతులకు మద్దతిచ్చినందుకు కక్షగట్టి..
వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.
అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు.
ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్‌బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి.
దీంతో పోలీసులు అంబులెన్స్‌లో వరికూటిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. చివరకు రేపల్లె పట్టణ ఎస్‌ఐ జోక్యంతో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి.

వెన్ను, నడుముపై పిడిగుద్దులు గుద్దారు..
రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ఈ సందర్భంగా అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు.
రైతులకు అండగా తన ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. కాగా, వరికూటి అశోక్ బాబుపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అధిష్టానం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్నారు.
పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావులు ఖండించారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.