
విద్యార్థుల బాధలు పట్టవా
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్
గుంటూరు వెస్ట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యనభ్యసిస్తున్న దళిత, బహుజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా అవమానిస్తుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్‌ను సందర్శించామన్నారు. మంచినీరు అపరిశుభ్రంగా ఉందన్నారు. మరుగుదొడ్లు దుర్వాసనగా ఉన్నా పిల్లలు అలానే నెట్టుకొస్తున్నారన్నారు. అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని తెలిపారు. రుచిశుచీ లేని ఆహారాన్ని పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. మౌలిక వసతులపై స్పదించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం ఖర్చు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకంలో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు రవీంద్ర నాయుడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అజయ్, సాజిద్, పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోపి, జిల్లా నాయకులు భాను, కిరణ్‌లు పాల్గొన్నారు.