
పవర్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
మంగళగిరి: పోలీసులు క్రీడలలో రాణించడంతో కొత్తగా పవర్ లిఫ్టింగ్‌లో కోచింగ్ తీసుకునేందుకు క్యాంప్ ప్రారంభించడం సంతోషకరమని ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని గుంటూరు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిమ్‌లో పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిరామ్‌రెడ్డి మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ కోచింగ్ తీసుకున్న పోలీసులు పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, కార్యదర్శి షేక్ సంధాని, కోశాధికారి జి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కాసుల ఉదయ కిరణ్, క్రీడాకారులు నాగేశ్వరరావు, మస్తానవలి పాల్గొన్నారు.
భక్తులకు రాగి నాణేలు పంపిణీ
ఫిరంగిపురం: వేమవరం గ్రామంలోని కోటి లింగాల క్షేత్రంలో 40 అడుగుల లోతున నిర్మిస్తున్న పాతాళకాళీ విగ్రహ ప్రతిష్ట పీఠం కింద భక్తులచే రాగి నాణేలు శుక్రవారం వేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు రాగి నాణేలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. వాటిని పీఠం కింద భాగంలో వేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జ్ఙానప్రసన్న బాబా ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి 10వ తేదీ వరకు భక్తులు స్వహస్తాలతో రాగినాణేలు వేసేలా వారికి ఉచితంగా అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార దరఖాస్తుల స్వీకరణకు గడువు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్‌గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు.
కేంద్రియ విద్యాలయలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం
నాదెండ్ల: ఇర్లపాడు పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయలో శుక్రవారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో తృతీయ సోపాన్ పరీక్ష శిబిరం 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణలోని 26 కేంద్రియ విద్యాలయాల నుంచి స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు జరిగే శిబిరం తెలంగాణ విద్యార్థులతో కళకళలాడింది. ప్రిన్సిపల్ నీరజ్‌కుమార్ శ్రీవత్స, ఉపాధ్యాయులు ముందుగా ఘనస్వాగతం పలికారు. తొలిరోజు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్నేహపూర్వక ప్రయాణం అంశాలపై కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, సిబ్బంది క్యాంప్ కిట్లు అందించారు. అనంతరం స్కౌట్స్ పెట్రోల్స్, మార్చ్‌ఫాస్ట్, స్వాగత నృత్యం ఆకర్షించాయి. క్వార్టర్ మాస్టర్ ఎస్. విజయ్‌కుమార్, ఎల్‌వోసీ రమేష్‌బాబు పాల్గొన్నారు.

పవర్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం