
ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు
గుంటూరు మెడికల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఉదంతంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్లలో (సంతాన సాఫల్య కేంద్రాలు) వైద్య అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 27 సెంటర్లు ఉండగా, శుక్రవారం 17 సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. సెంటర్లలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు స్వయంగా పరిశీలించారు. పలు సెంటర్లలో ఫీజుల వివరాలు తెలియజేసే బోర్డులు లేకపోవడంతో, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలు రికార్డులు సక్రమంగా లేకుండా ఉండటంతో వాటిని కూడా సరైన పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గైనకాలజిస్టులు, ఇతర వైద్య సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం కూడా తనిఖీలు కొనసాగుతాయని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఫీజుల వివరాలు బోర్డులు ప్రదర్శించడం లేదని పలు చోట్ల గుర్తించామన్నారు. తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని ఆయా ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.