నైపుణ్యాలు ఉంటేనే విజయం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు ఉంటేనే విజయం

Aug 3 2025 3:24 AM | Updated on Aug 3 2025 3:24 AM

నైపుణ

నైపుణ్యాలు ఉంటేనే విజయం

విజ్ఞాన్‌ 13వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో అతిఽథులు

చేబ్రోలు: విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఒక్కటే విజయాన్ని అందించలేదని, ముఖ్యమైన జీవన నైపుణ్యాలను అలవర్చుకున్నవారే రాణించగలరని హైదరాబాద్‌లోని ఐల్యాబ్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేశారు. వివిధ రంగాలలో కృషి చేసిన ముగ్గురికి గౌరవ డాక్టరేట్‌లను అందజేశారు. హైదరాబాద్‌లోని ఐల్యాబ్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ చింతలపాటి శ్రీనివాసరాజు, హైదరాబాద్‌లోని జెన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అట్లూరి, మ్యూజిక్‌ గురు, ఇండియన్‌ ప్లేబాక్‌ సింగర్‌ కంపోజర్‌, లిటిల్‌ మ్యాజిసియన్స్‌ అకాడమీ ఫౌండర్‌ డాక్టర్‌ కొమండూరి రామాచారిలకు ఈ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 2,122 మంది విద్యార్థులకు డిగ్రీలు, 60 మందికి బంగారు పతకాలను అందజేశారు.

విద్యార్థులకు సూచనలు

గౌరవ డాక్టరేట్‌ అందుకున్న చింతలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ... మంచి అలవాట్లు, చక్కని ప్రణాళిక విజయానికి ఎంతో కీలకమన్నారు. విద్యార్థి దశలోనే అమలు చేయాలని సూచించారు. చదువులో పరిజ్ఞానంతోపాటు విశ్వ నైపుణ్యాలను సొంతం చేసుకున్నవారు వృత్తి జీవితంలో రాణించగలరన్నారు. ఏఐ టూల్స్‌పై పట్టు సాధించాలని సూచించారు. హైదరాబాద్‌లోని జెన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అట్లూరి మాట్లాడుతూ సామాజిక అసమానత వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. వాటిని వినూత్నంగా పరిష్కరించడం యువత బాధ్యత అన్నారు. ఇండియన్‌ ప్లేబాక్‌ సింగర్‌ కంపోజర్‌, లిటిల్‌ మ్యాజిసియన్స్‌ అకాడమీ ఫౌండర్‌ డాక్టర్‌ కొమండూరి రామాచారి మాట్లాడుతూ డాక్టరేట్‌ ప్రతిభకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. యువత కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

శాంతి మంత్రం ప్రగతికి కీలకం

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ చూసినా కలహాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మన మధ్య మళ్లీ ఒక గాంధీ, ఒక బుద్ధుడు పుడితే ఎంత మంచిదో అనిపిస్తోందన్నారు. శాంతే మన అభివృద్ధికి మూలస్తంభమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు, అవి కూడా సమాజానికి అందుబాటులో ఉండేలా చేయడం విద్యార్థుల బాధ్యత అన్నారు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మేకిన్‌ ఇండియా మాత్రమే కాదు – ఇన్వెంట్‌ ఇన్‌ ఇండియా, డిజైన్‌ ఇన్‌ ఇండియా, లీడ్‌ ఫ్రమ్‌ ఇండియా కూడా కావాలని పిలుపునిచ్చారు. విభిన్న రంగాలలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై, విజ్ఞానాన్ని వ్యవస్థగా మారుస్తూ ఆలోచనలను ప్రభావవంతంగా మలచడంపై దేశాభివృద్ది ఆధారపడి ఉందన్నారు.

విద్యార్థుల కేరింతలు

డిగ్రీలు పొందిన వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను వారు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వేషధారణలో వచ్చారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ పి.నాగభూషణ్‌ , సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు, స్నాతకోత్సవ కన్వీనర్లు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహ, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయులు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం తెలిపారు.

ఐల్యాబ్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ చింతలపాటి శ్రీనివాసరాజు ఘనంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం

నైపుణ్యాలు ఉంటేనే విజయం 1
1/4

నైపుణ్యాలు ఉంటేనే విజయం

నైపుణ్యాలు ఉంటేనే విజయం 2
2/4

నైపుణ్యాలు ఉంటేనే విజయం

నైపుణ్యాలు ఉంటేనే విజయం 3
3/4

నైపుణ్యాలు ఉంటేనే విజయం

నైపుణ్యాలు ఉంటేనే విజయం 4
4/4

నైపుణ్యాలు ఉంటేనే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement