
అదే వంచన
పింఛన్ల మంజూరులోనూ
చంద్రబాబు అంటే మాయమాటలకు పెట్టింది పేరు. ఇక అధికారంలోకి రావడానికి ఆయన వేసే ఎత్తులు అందరికీ తెలిసినవే. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా ఏ పని చేసినా ప్రచార ఆర్భాటం తప్ప అసలు నిజం వేరే ఉంటుంది. ఇదే కోవలో పింఛన్ల సంఖ్య పెంచామని ఆయన చేసిన ప్రకటన కూడా చేరిపోయింది. రెండు నెలలుగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించి, వారికి పింఛను ఎగ్గొట్టారు. తర్వాత నెలలో పునరుద్ధరించి, కొత్తగా ఇచ్చినట్లు చూపారు.
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి తేలింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. ఇలా మోసపోయిన జాబితాలో తాజాగా వితంతువులు కూడా చేరారు. భర్త మరణిస్తే భార్యకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు సర్కార్‌కే దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా 4,700 మందికి స్పౌజ్ పెన్షన్ రెండు నెలల కింద మంజూరైనట్లు తెలిపి ఈ ఏడాది జూన్ 12వ తేదీన పెన్షన్ ఇస్తామని నమ్మబలికారు. జూలై నెలలో రెండు నెలలకు కలిపి బ్యాంకు ఖాతాలో పడతాయని మళ్లీ నమ్మించారు. అయితే అప్పటి నుంచి వారికి మాత్రం పెన్షన్ అందలేదు. తాజాగా మరోసారి పెన్షన్ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామంటూ మీడియా ముందు ప్రచార ఆర్భాటానికి దిగారు. అయితే అర్హులని తేలినప్పటికి 4,700 మందికి నెలకు రూ.4 వేల చొప్పున రూ.1.88 కోట్ల వంతున రెండు నెలలకు కలిపి రూ.3.76 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ ఇచ్చినట్లుగా ఈ నెలలో రూ.4 వేలు ఇచ్చారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలకు ప్రభుత్వం తరఫున వీలైనంత త్వరగా సాయం అందించి ఆదుకోవాలి. అది పోయి ఇలా ఆలస్యం చేసి వారిని వంచించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు ఒకటో తేదీనే ఠంచనుగా..
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లబ్దిదారులుగా ఎంపికై న తరువాత ఆ వెంటనే వచ్చే ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా అందేది. ఇందులో ఎటువంటి ఆలస్యం లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేవి. అయితే వలంటీర్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి అంతా తామే చేసేస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం.. లబ్ధిదారుల జీవితాలతో ఈ విధంగా ఆడుకుంటోంది. వితంతు ఫించన్ల విషయంతో తాత్సారం చేసింది. ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పుడు న్యాయం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
రెండు నెలలుగా ఎగ్గొట్టి కొత్తగా ఈ నెల నుంచి ఇచ్చిన వైనం జిల్లా వ్యాప్తంగా 4,700 మందికి రెండు నెలల స్పౌజ్ పింఛను రూ.3.76 కోట్లు ఎగవేత