
న్యాయమైన హక్కులను కాపాడాలి
గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామ కాలు, సీపీఎస్ రద్దు, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టడంతోపాటు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని తెలిపారు. 18 రకాల డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరాంజనేయులు, కో–చైర్మన్ బి.సత్యం, రాజశేఖర్, జి.వేళాంగిణి, తిరుమలేష్, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో జిల్లా చైర్మన్ నరసింహారావు