
వార్షిక కౌలు అర్జీలు వేగంగా పరిష్కరిస్తున్నాం
తాడికొండ: వార్షిక కౌలు సంబంధిత అర్జీలు సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇటీవల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన 2024– 25వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన సమస్యల గురించి పలువురు రైతులు, భూయజమానులు తమ అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక కౌలుకు సంబంధించి రైతులు అందజేసిన అర్జీలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో రైతులకు కౌలు నగదు జమ కానట్లయితే.. సాధ్యమైనంత వేగంగా కౌలు నగదు జమయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఫేజ్– 1 కింద రైతులకు ఇప్పటికే కౌలు నగదు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఫేజ్– 2 కింద జమ చేయాల్సిన కౌలు నగదు సాధ్యమైనంత వేగంగా ఖాతాలలో జమ అవుతుందని వివరించారు. కౌలు సంబంధిత అర్జీలకు సంబంధించిన సాంకేతిక సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు సీఆర్డీఏ ఐటీ విభాగ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై అర్జీదారులు తెలియజేసిన ఫిర్యాదులను పరిష్కరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. 78 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు బి.సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, పి.పద్మావతి, జి.రవీందర్, జి.భీమారావు, ఎ.జి.చిన్నికష్ణ, కె.ఎస్.భాగ్యరేఖ, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి పి.జయశ్రీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అకై ్వజేషన్) ఎన్‌వీఎస్‌బీ వసంతరాయడు, సీఆర్డీఏ సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి.పాండురంగరావు రామకృష్ణన్, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్.మధుసూదనరావు పాల్గొన్నారు.
సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్
మీడియాపై ఆంక్షలు
సీఆర్డీఏలో చేపట్టిన గ్రీవెన్స్‌కు మీడియాను లోపలికి అనుమంతిచకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు పంపించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాకు వార్తలు కవరేజ్ చేస్తే కేసులు పెడతానని అడిషనల్ కమిషనర్ అనడంతో మీడియాను అడ్డుకోవడం తగదని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు పడలేదని దరఖాస్తులు రావడంతో పాటు పలువురు మీడియా ఎదుట ఆవేదన వెల్లగక్కుతుండటంతో అధికారులు ఆంక్షలు విధించారు. దీనిపై పలువురు రాజధాని ప్రాంత వాసులు మండిపడుతున్నారు.