
బాల శాస్త్రవేత్తలకు ‘ఇన్‌స్పైర్’
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఏటా ఇన్‌స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. చిట్టి బుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తోంది. పాఠశాల స్థాయిలో వాటికి బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా 2025–26 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ మానక్ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆన్‌లైన్‌లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది.
ఇంటర్ విద్యార్థులకూ అవకాశం
విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే ప్రాజెక్ట్‌ల సమగ్ర నివేదికను తొలుత ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు చొప్పున ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో విద్యార్థులతో చేయించాలి. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా ఇన్‌స్పైర్ మానక్‌లో భాగస్వాములను చేసేందుకు అవకాశాలు కల్పిస్తోంది. హైస్కూల్ ప్లస్ నుంచి ఏడు ప్రాజెక్టులను నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది.
విద్యార్థులతో
రిజిస్ట్రేషన్ చేయించాలి
ఇన్‌స్పైర్ మానక్ ప్రదర్శనపై అన్ని యూపీ, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలి. ఆసక్తి గల విద్యార్థులను కచ్చితంగా ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చడంలో ఐన్‌స్పైర్ ప్రోగ్రామ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని పాఠశాలలు తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి.
– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతి విద్యార్థికి రూ.10వేలు ఇవ్వనున్న కేంద్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని విద్యాశాఖ ఆదేశాలు సమర్పించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు
రిజిస్ట్రేషన్ ఇలా...
విద్యార్థులు ఇన్‌స్పైర్ అవార్డ్స్–డీఎస్‌టీ.జీవోవీ.ఇన్ సైట్‌కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థి పేరు, పాఠశాల, చదువుతున్న తరగతి వివరాలతో పాటు ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, పేరెంట్ జాయింట్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర వివరాలు నమోదు చేయాలి. పూర్తి వివరాలను హెచ్‌ఎం, సైన్స్ టీచర్ల నుంచి పొందాలి. విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత వాటిలో బెస్ట్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసి, ప్రదర్శన జరిగే సమయంలో వాటిని తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులను కలుపుకుని విద్యార్థికి రూ.10వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.