
మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు
నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్‌లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు.