
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.
ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.
సింగపూర్‌కు వెళ్లి ఏమి సాధించారు?
ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్‌కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్‌కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్‌సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు.
ఏం చేసినా జగన్‌ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్‌ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్‌ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి.

లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు.