కార్పొరేషన్‌ అధికారుల నియంత ధోరణి | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ అధికారుల నియంత ధోరణి

Aug 1 2025 11:40 AM | Updated on Aug 1 2025 11:40 AM

కార్పొరేషన్‌ అధికారుల నియంత ధోరణి

కార్పొరేషన్‌ అధికారుల నియంత ధోరణి

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు అధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఆప్కాస్‌ (అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌)ఉద్యోగుల విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమకు నచ్చిన వారు విధులకు రాకపోయినప్పటికీ జీతాలు చెల్లిస్తున్నారు. అనారోగ్యం, ఇతర సమస్యలలో ఎవరైనా సెలవులు పెడితే నిర్దాక్ష్యిణ్యంగా తొలగిస్తున్నారు. విధుల్లో తీసుకోవాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆరు నెలలకు పైబడి విధుల్లో లేని వారి డేటా ప్రభుత్వం సేకరించి తమకు పంపిందంటూ తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.

తొలగించేందుకు రంగం సిద్ధం

నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్‌ పద్ధతిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 996 మంది, ప్రజారోగ్య విభాగంలో 1897 మంది పని చేస్తున్నారు. ఇందులో ఆప్కాస్‌ అధికారుల ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరవుతున్నారనే నెపంతో ప్రజారోగ్య విభాగంలో 124 మందిని (వీరిలో కొంత మంది చనిపోయిన వారు ఉన్నారు), ఇంజినీరింగ్‌ విభాగంలో 48 మందిని తొలగించేందుకు అంతా సిద్ధం చేశారు. పలు కారణాలతో విధులకు రాని వారు తిరిగి చేరేందుకు కార్యాలయానికి వస్తున్నా పట్టించుకోవడం లేదు. పేరును ఆప్కాస్‌ నుంచి తొలగించారని.. ఇప్పుడు చేసేదేమి లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు.వారి స్థానంలో తమ వారిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆప్కాస్‌ ఐడీ క్రియేట్‌ అయితే చాలు..అది ఎంత కాలమైనా ఉంటుంది. ఉద్యోగి విధులకు గైర్హాజరైతే కమిషనర్‌ ఆదేశాలతో తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలికి ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.

విధులకు రాకపోయినా జీతాలు

నగరపాలక సంస్థ కార్యాలయంలో తమ వారైతే విధులకు హాజరు కాకపోయినప్పటికీ అధికారులు వారికి జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ రిజర్వాయర్‌ పరిధిలో ముగ్గురు విధులకు రాకుండానే జీతాలు డ్రా చేస్తుండటంపై కమిషనర్‌ ఆరా తీశారు. ఇంజినీరింగ్‌ అధికారులు దాన్ని కవర్‌ చేసే ప్రయత్నం చేశారు. దీనిపై సీరియస్‌ అయిన కమిషనర్‌ ఇంజినీరింగ్‌ విభాగ సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సమాచారం. రూరల్‌ ప్రాంతాల్లో కూడా సిబ్బంది గంట కూడా విధులు నిర్వహించకుండానే రూ.18వేలు, ఆ పైన జీతం తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య వచ్చి విధులకు గైర్హాజరయితే విధుల్లోకి తీసుకోని అధికారులు .. కొందరు రాకపోయినప్పటికి జీతాలు ఏ విధంగా చెల్లిస్తారంటూ కొంత మంది ఆప్కాస్‌ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఉద్యోగ విరమణ, చనిపోవడం కారణంగా సిబ్బంది తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 172 మందిని తొలగించేందుకు కుట్ర జరగడంపై ఆప్కాస్‌ ఉద్యోగులు మండి పడుతున్నారు.

పని చేయకుండానే జీతాలు డ్రా

ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో ఆప్కాస్‌ పద్ధతి కింద 996 మంది పనిచేస్తున్నారు. వీరిలో రు 120 మంది ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి నెల ఆయా పేర్లు మీద డ్యూటీ సర్టిఫికెట్‌ వస్తుంది. జీతాలు కూడా డ్రా అవుతాయి. ముందు వీరు ఎక్కడ పనిచేస్తున్నారో లెక్క తేల్చి..తమను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విధులకు గైర్హాజరైన సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

172 మంది ఆప్కాస్‌ ఉద్యోగుల

తొలగింపునకు కుట్ర

తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని

కోరినా స్పందించని అధికారులు

నగరపాలక సంస్థలో పనిచేయని

సిబ్బందికి కూడా జీతాలు

120 మంది ఎక్కడ పనిచేస్తున్నారో

కూడా తెలియని పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement