
బల్లి గండం తప్పింది !
తెనాలి అర్బన్: ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన అయిన కేజీబీవీ ఉపాధ్యాయినుల్లో నలుగురు ఇంకా తెనాలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిస్‌చార్జి చేసే అవకాశం ఉంది. సాక్షి దినపత్రికలో ‘‘భోజనంలో బల్లి–కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత’ అనే శీర్షికన గురువారం వార్త ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీనిపై గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయినులను పరామర్శించారు. ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంపై శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే కళాశాలలో ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంను సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, ఏఎస్‌ఆర్, బాపట్ల, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు, మన్యం, నంద్యాల, ఎన్‌టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాల పరిధిలోని కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే 170 మంది ఉపాధ్యాయినులు తెనాలి వచ్చారు. వీరికి వసతిని కళాశాల యాజమాన్యం సమకూర్చింది. భోజనం, టిఫెన్స్‌లను ప్రభుత్వం నియమించిన వెండర్ సమకూరుస్తున్నారు.
పుల్కా కర్రీలో బల్లి
బుధవారం రాత్రి 8గంటల సమయంలో ఉపాధ్యాయినులకు భోజనం, టిఫెన్‌ను సదరు వెండర్ ఏర్పాటు చేశారు. పుల్కా కర్రీలో అప్పటికి బల్లి పడింది. దీన్ని గమనించక అందరూ దానిని తిన్నారు. చివరి సమయంలో ఒక ఉపాధ్యాయిని బల్లిని గమనించి ఫిర్యాదు చేసింది. దీంతో అందరిలో ఆందోళన ప్రారంభమైనది. ఇలా జరిగిన కొద్ది గంటలకే సుమారు 14 మంది వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. అధికారులు వారికి మందులు పంపిణీ చేశారు. 14 మందిని చికిత్స నిమిత్తం తెనాలిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. 10మందికి ప్రాథమిక చికిత్స చేసి మరలా వసతి గృహానికి పంపారు. మిగిలిన నలుగురు వైద్యశాలలో గురువారం కూడా చికిత్స పొందుతూ వచ్చారు.
అధికారుల అప్రమత్తత
సాక్షిలో కథనం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీశారు. స్థానిక వీఆర్వో, ఉపాధ్యాయినుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. మిగిలిన వారికి గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.శిక్షణ తరగతికి తమ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, అధికారుల ఆదేశాల మేరకు వసతి మాత్రమే కల్పించామని జేఎంజే కళాశాల నిర్వాహకులు తెలిపారు.
కాంట్రాక్టర్‌ను మార్చాం
సంఘటన దురదృష్టకరం. భోజనం కాంట్రాక్టర్‌ను మార్చివేశాం. అస్వస్థతకు గురైన వారిని కొలుకున్న తరువాత స్వగృహాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–సి.వి.రేణుక, డీఈవో
కోలుకుంటున్న కేజీబీవీ
ఉపాధ్యాయినులు
నలుగురికి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స
జిల్లా విద్యాశాఖాధికారి రేణుక
పరామర్శ
సాక్షి కథనంతో దిద్దుబాటు
చర్యలకు దిగిన అధికారులు
ఫుడ్ కాంట్రాక్టర్‌కు ఉద్వాసన
అస్వస్థతకు గురైన వారిని
ఇంటికి పంపేందుకు చర్యలు