తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుదర్శన స్వామికి అభిషేకం, దృష్టి దోష, దుష్ట గ్రహ దోష నివారణ, ఆయురారోగ్యాభివృద్ధికి సర్వరక్షాకర హోమం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.
అండర్–18, 20 జిల్లా అథ్లెటిక్ సభ్యుల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చీరాలలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అండర్–18, 20 యువతీ యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డుతో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు 9వ తేదీ ఉదయం 6 గంటలకు చీరాలలోని వీఆర్‌ఎస్‌అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలోని క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
ఎయిమ్స్‌లో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
45 నిమిషాల అనంతరం పునరుద్ధరణ
తాడేపల్లి రూరల్: మంగళగిరి ఎయిమ్స్‌లో గురువారం ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఓపీ దగ్గర భారీగా రోగులు నిలబడి ఆందోళన చేశారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాన్యువల్‌గా సేవలను అందించారు. 45 నిమిషాల అనంతరం పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతిరోజు వేలాదిమంది వస్తున్నారు. నెలకు రెండు, మూడుసార్లు ఇదే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయిన వెంటనే మాన్యువల్ సేవలు అందజేశామని తెలిపారు. ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బంది పడ్డామని, అయితే సాధ్యమైనంత త్వరగా ఆన్‌లైన్ సేవలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.
అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి
జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక
తెనాలి అర్బన్: విద్యార్థులంతా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి సివి.రేణుక సూచించారు. తెనాలి ఐతానగర్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌ఎంహెచ్ స్కూల్‌ను గురువారం ఆమె పరిశీలించారు. విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. మధ్యాహ్న భోజన పథకం రికార్డుల పరిశీలనతో పాటు విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్ల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట పలువురు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.