మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం | YSRCP Chief YS Jagan Slams Chandrababu Nadu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. మీ నోటితో మీరు చెప్పింది ముమ్మూటికీ వాస్తవమే: వైఎస్‌ జగన్‌

Aug 2 2025 9:44 PM | Updated on Aug 2 2025 9:58 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababu Nadu

తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు  చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ఎండగట్టారు వైఎస్‌ జగన్‌ 

1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్‌-6, సూపర్‌-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 

2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు.  మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.

3. ఇవాళ దర్శి సభలో  మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే.  

4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్‌ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు.  

5. మా 2019, మేనిఫెస్టోలో  4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.

6. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని  మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు  చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్‌ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.

7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

8. చంద్రబాబుగారూ…, వైయస్సార్‌సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.

9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.

10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.

11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్‌కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .

12.ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ను, టెస్టింగ్‌ ల్యాబులను నిర్వీర్యంచేశారు.

13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్‌ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.

14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement