
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని.. అయినప్పటికీ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు? అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ.90 వేల కోట్లు ఖర్చయ్యే సూపర్ సిక్స్ పథకాలకు 12 వేల కోట్లు ఇస్తే సరిపోయినట్టా? అని ప్రశ్నించారు.
యాబై మంది ఎక్కే బస్సులో 150 మంది మహిళలను ఎక్కిస్తూ వారి ఆత్మగౌరవం దెబ్బ తీశారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజల కోసం మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ విజనరీనా?. వాటిని తన బినామీలకి దోచిపెట్టే చంద్రబాబు విజనరీనా?. కూటమి పార్టీల నేతల వైఖరి చూసి జనం ఆందోళనల చెందుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు, ఇప్పుడు చేస్తున్న పనులు చూసి జనం నివ్వెర పోతున్నారు’’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘అనంతపురం సభలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారు. జగన్ కంటే ఎక్కువగా 143 ఎక్కువ హామీలు ఇచ్చి నిలువెల్లా మోసం చేశారు. తన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుని నవ్వుల పాలయ్యారు. అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చారా?. నిరుద్యోగ భృతి కింద 20 లక్షల మందిలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?. రూ.7,200 కోట్లు ఇప్పటికే నిరుద్యోగులకు ఇవ్వాలి. మరి ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద కోటి 80 లక్షల మందికి రూ.32,400 కోట్లు ఇవ్వాలి.. ఇచ్చారా?. తల్లికి వందనం కింద 87 లక్షల మందికి రూ.13 కోట్లకు పైనే ఇవ్వాలి.. ఇచ్చారా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.
‘‘ఉచిత బస్సు పేరుతో ఒక్కో బస్సులో 150 మందిని కుక్కించి మహిళల ఆత్మగౌరవం తీసేశారు. బస్సులను తగ్గించి యాభై మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కిస్తారా?. దీపం కింద కోటి 59 లక్షల మందికి రూ.5 వేల కోట్లు అవసరం. మరి ఖర్చు చేశారా?. సూపర్ సిక్స్ పథకాల కింద మొత్తం సంవత్సరానికి రూ.70 వేల కోట్లు ప్రజలకు చేరాలి. మరి ఈ 16 నెలలో కేవలం 12 నుండి 13 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. 90 వేల కోట్లు ఖర్చయ్యే సూపర్ సిక్స్ పథకాలకు 12 వేల కోట్లు ఇస్తే సరిపోయినట్టా?. ఇది ప్రజలను నిలువునా మోసం చేయటం కాదా?’’ అని సతీష్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.
..సూపర్ సిక్స్ అందకపోతే ఎక్కడ దరఖాస్తు చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అట్టర్ ప్లాప్ అయిన సూపర్ సిక్స్‌ని సూపర్ హిట్ అని ఎలా చెప్తున్నావ్ చంద్రబాబూ?. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు. జగన్ హయాంలో ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో రైతులు దుర్భిక్షం అనుభవిస్తున్నారు. జగన్ పాలనలో రైతులు ఎలా బతికారు? ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. ఉల్లి, టమోటా, మిర్చి, పొగాకు, మామిడి, చినీ, ధాన్యం ఇలా ఏ పంటకు చూసినా గిట్టుబాటు ధరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతకాలి?

..కళ్లు తెరిచి చూస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి. వివేకా హత్య కేసులో సునీత కోరినట్టే సీబిఐ విచారణ జరిపింది. మళ్లీ పునర్విచారణ అంటూ కొత్త డ్రామాలు ఎందుకు?. ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు రాయటం సిగ్గుచేటు. ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని రాసిన రాధాకృష్ణకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న దోపిడీ కనపడటం లేదా?. మరి వాళ్ల మీద రాధాకృష్ణ ఎందుకు వార్తలు రాయటం లేదు?.
ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు అందక విద్యార్థులు పడుతున్న కష్టాలు కనపడటం లేదా?. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీ ప్రతిపక్షం కాదా?. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి మైకు ఇస్తున్నారా?. కనీస సమయం కూడా ఇవ్వకుండా అసెంబ్లీకి రమ్మని ఎలా అంటారు?. ప్రెస్‌మీట్‌లో జగన్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారు?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.