ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్‌ జగన్‌ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్‌రెడ్డి | Sv Satish Reddy Fires On Chandrababu Government Conspiracies | Sakshi
Sakshi News home page

ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్‌ జగన్‌ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్‌రెడ్డి

Jul 30 2025 6:48 PM | Updated on Jul 30 2025 7:35 PM

Sv Satish Reddy Fires On Chandrababu Government Conspiracies

సాక్షి, నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.

మహిళా నేతల ఇంటికి అర్థరాత్రి సమయాల్లో వెళ్ళి నోటీసుల పేరుతో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పర్యటనకు ఎవరూ వెళ్ళకూడదంటూ ప్రభుత్వమే అడ్డుకోవడం చూస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలనుకునే అవివేకమే కనిపిస్తోందని అన్నారు. ఇంకా వారేమన్నారంటే..

ప్ర‌భుత్వ ఒత్తిడి త‌ట్టుకోలేక ఎస్పీ సెల‌వుపై వెళ్లిపోయారు: సతీష్‌రెడ్డి
వైఎస్‌ జ‌గ‌న్ గురువారం నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. అక్ర‌మ కేసుల్లో జైలుపాలైన మా పార్టీ నాయ‌కులు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని ప‌రామ‌ర్శించ‌డానికి రావాల‌ని నిర్ణ‌యించుకుంటే పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా ప‌డింది. హెలిప్యాడ్‌కి స్థ‌లం కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి నాయ‌కుల‌ను అడ్డుకోవ‌డం వ‌ర‌కు అడుగ‌డుగునా వైఎస్‌ జ‌గ‌న్‌ని రాకుండా చేయాల‌ని కుట్ర‌లు చేస్తున్న‌ట్టుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైఎస్‌ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నెల్లూరులో 2 వేల మందికి పైగా నోటీసులిచ్చారు.

ప‌ట్టాభిరామిరెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడికి కూడా నోటీసులిచ్చారు. అర్ధరాత్రి 1.26 గంట‌ల‌కు టూటౌన్ ఎస్సై ఒక మ‌హిళ కార్పొరేట‌ర్‌ను నిద్ర‌లేపి నోటీసులిచ్చి వెళ్లారు. వారితో క‌నీసం ఒక మహిళా కానిస్టేబుల్‌ను కూడా తీసుకురాలేదు. జ‌గ‌న్ కార్య‌క్రమానికి వెళితే మీ వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని కిరాయి వాహ‌నాల య‌జ‌మానుల‌కు నోటీసులిచ్చారు.

ఇలాంటి చట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను చూడ‌లేక‌, వాటిలో భాగంకాలేక‌, అధికార పార్టీ పెట్టే ఒత్తిడిని త‌ట్టుకోలే జిల్లా ఎస్పీ సెల‌వుపై వెళ్లారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా రేప‌టి వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌ను ఆప‌లేరు. వైయ‌స్ జ‌గ‌న్ కోసం వ‌చ్చే జ‌న ప్ర‌భంజనాన్ని అడ్డుకోలేరు. వైయ‌స్ ప‌ర్య‌ట‌నల‌కు జ‌నాన్ని రాకుండా అడ్డుకోవ‌డమంటే అర‌చేతితో సూర్య‌కిర‌ణాల‌ను ఆపాల‌నుకోవ‌డ‌మే అవుతుంది.

ప్ర‌శాంత‌మైన నెల్లూరులో ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు తెర‌దీశారు:
ద‌శాబ్దాలుగా ప్ర‌శాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. సీనియ‌ర్ నాయ‌కులు న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేసి ఫ‌ర్నీచ‌ర్ ప‌గ‌ల‌గొట్టి కారు మీద పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెడితే, ఇంటిని ధ్వంసం చేస్తే నిందితుల మీద పోలీసులు క‌నీసం కేసులు కూడా న‌మోదు చేయ‌లేదు. మ‌రీ విచిత్రంగా దాడి జ‌రిగిన స‌మ‌యంలో పోలీసులే అక్క‌డే ఉండి కూడా గూండాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇదంతా చూస్తుంటే మ‌నం ప్ర‌జాస్వామ‌యంలో ఉన్నామా అనే అనుమానం క‌లుగుతోంది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌ట‌కొచ్చి మాట్లాడుతుంటే ఈ ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంది. గుంటూరు, పొదిలి, స‌త్తెన‌ప‌ల్లి, బంగారుపాళ్యెం ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళితే అక్క‌డి నాయ‌కుల‌ను అక్ర‌మంగా నిర్బంధించారు. ప‌ర్య‌ట‌న త‌ర్వాత వంద‌లాది మంది వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద అక్ర‌మ కేసులు న‌మోదు చేశారు. ఆఖ‌రుకి ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన మ‌ర‌ణాన్ని కూడా వైఎస్‌ జ‌గ‌న్ మీద‌కి నెట్టి క్షుద్ర రాజ‌కీయం చేశారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వినిపిస్తున్న సాక్షి ఛానెల్ మీద అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు. ఎంత‌సేప‌టికీ వైయ‌స్ జ‌గ‌న్‌ని అడ్డుకోవాల‌ని, వైఎస్సార్సీపీని లేకుండా చేయాల‌నే ఆరాటం త‌ప్ప‌, ఓటేసిన ప్ర‌జ‌ల‌కు న్యాయం చేద్దామ‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామ‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకి, లోకేష్‌కి ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదని ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్‌ జగన్ పర్యటనను అడ్డుకోలేరు: ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి
గ‌త వారం ప‌ది రోజులుగా నెల్లూరులో నెల‌కొన్న ప‌రిస్ధితులు చూస్తే కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్నది రాక్ష‌స పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. నెల్లూరులో జిల్లాలో మా పార్టీ అధ్య‌క్షులు వైఎస్‌ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డానికి కూట‌మి నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వైఎస్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద అక్ర‌మ కేసులు బ‌నాయించి కార్య‌క్ర‌మానికి రాకుండా చేయాల‌ని చూస్తున్నారు. హెలిప్యాడ్‌కి అనుమ‌తుల విష‌యంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎన్ని కుట్రలు చేసినా వైఎస్‌ జగన్ పర్యటనను అడ్డుకోలేరు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్‌ జగన్‌ను కలవనివ్వకండా జనాన్ని ఆంక్షల పేరుతో కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. ప్రశాంతంగా జరిగే పర్యటనలను కావాలనే రెచ్చగొట్టి, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందిపెట్టి విఫలం చేయాలని పోలీసులను పావులుగా చంద్రబాబు, లోకేష్‌లు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement