
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు
‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్‌లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.
‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు.