
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్‌ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.
‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.