
తాడేపల్లి: కల్పిత ఆధారాలతో తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్.. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలులో వేశారు. అధికారులను కూడా జైల్లో వేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారనే కారణంగా ఇప్పుడు కక్ష కట్టి అరెస్టులు చేస్తున్నారని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.
‘‘కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ4 గా నమోదు చేశారు. గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని కాకాణిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. పల్నాడులో జంట హత్యలు చేసింది టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీనే ప్రకటించారు. అయినప్పటికీ తిరిగి పిన్నెల్లి సోదరులపై కేసు పెట్టారు. ఎస్పీ మాటలనే అభాసుపాల్జేశారంటే ఎంతటి దారుణమైన వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం మృతులను కూడా రాజకీయ కక్షసాధింపునకు వాడుకోవటం సిగ్గుచేటు’’ అని మేరుగ మండిపడ్డారు.
..ప్రజల కోసం పని చేయాలన్న ఆలోచనే ప్రభుత్వ పెద్దలకు లేదు. ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరి, పొగాకు, మిర్చి, శనగ, పత్తి, మినుము.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేవు. జగన్ హయాంలో రైతుకు భరోసా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులంటే ఎంత మాత్రం లెక్కలేదు.
..వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తేగానీ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయలేదు. పొగాకు రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వైఎస్ జగన్ హయాంలో రూ.35 వేలు పలికింది. ఇప్పుడు కూలి ఖర్చులు కూడా రావటం లేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతుల్లో ధైర్యం కల్పించేందుకు 28న పొదిలి వెళ్తున్నారు’’ అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
