
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిలరీల నిర్వాహకులంతా టీడీపీ వారేనని.. మద్యం తయారీకి యథేచ్ఛగా స్పిరిట్‌ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
‘‘ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ మద్యమే. టీడీపీ నాయకుల ధన దాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
..కల్తీ మద్యం తాగి ఇటీవల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు.